*డిగ్రీ కాలేజ్ కోసం విద్యార్థుల బాధలు*
– ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం విద్యార్థుల నిరీక్షణ
– చదువు‘కొనే’ స్థోమత లేక ఇంటర్ తో ఆపేయడమేనా
ముస్తాబాద్, ఫిబ్రవరి 04
ముస్తాబాద్ మండలంలో డిగ్రీ కళాశాల లేకపోవడంతో అనేకమంది పేద విద్యార్థులు ఇంటర్‌తోనే చదువును ఆపేస్తున్నారు.ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉన్న మండలాల్లో డిగ్రీ కళాశాలలను నెలకొల్పమని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు పోస్ట్ కార్డులతో, కరపత్రాలతో ,బ్యానర్లతో నిరసనలు తెలిపినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో అనేకమంది విద్యారులు డిగ్రీ చదువు‘కొన’లేక ఇంటర్‌తోనే ముగించేస్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లి దండ్రులు కష్టపడి ఇంటర్ వరకు చదివించినా అందుబాటులో డిగ్రీ కళాశాల లేకపోవడంతో అక్కడి వరకే చదువును ఆపివేయిస్తున్నారు. ఇంటర్ తర్వాత చదువుకోవాలని ఉన్నా అందుబాటులో కళాశాల లేకపోవడంతో పట్టణ ప్రాంతాలకు వెళ్లలేక ఇంటికే పరిమితమవుతున్నారు. కాస్త ఆర్థికంగా ఉన్న విద్యార్థులు పట్టణ ప్రాంతాలైన సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, దుబ్బాక ,హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి చదువుతున్నారు.
ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనేక సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాసి ఇంటర్‌లో ఉత్తీర్ణుల య్యారు. వీరంతా డిగ్రీలో చేరేందుకు ఆసక్తి ఉందంటూ తమ అభి ప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మండలంలో 16 గ్రామపంచా యతీల్లోని గ్రామాల వారు మండల కేంద్రానికి చేరుకోవాలంటే సరైన సదుపాయాలు లేవు. ఇక పట్టణాలకు వెళ్లి చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుందంటూ విద్యార్థులు వాపోతున్నారు. ఇటువంటి చోట డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద,గిరిజన విద్యార్థులకు ఎంతగానో మేలు చేకూరే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కొందరు విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో చదువును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బాలికలు మాత్రం చదువును ఇంటర్‌తోనే ఆపేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు పట్టణప్రాంతాల్లో బాలికలను చదివించలేక ఇంటి వద్దనే ఉంచుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరం అవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోకపోవడంతోనే గ్రామాల్లో బాలికలు చదువుకు దూరం అవుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధన కమిటీ చైర్మన్ చింతోజు బాలయ్య డిమాండ్ చేస్తున్నారు.
పల్లె సత్యం మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహిస్తే గ్రామీణ ప్రాంతాల్లో విద్యాకుసుమాలు వికసించే అవకాశాలు ఉన్నాయి. అయితే పాలకులు పలుసార్లు విన్నవించుకున్న ఉన్నత విద్య పట్ల ఆచరణలో అమలు చేయడం లేదని అన్నారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతూనే ఉన్నారు. మారుమూల మండలమైన ముస్తాబాదులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినట్లయితే మండలాలతో పాటు పలు గ్రామాల వారికి సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషిచేసి పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలంటూ కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ పిల్లలు, పల్లె సత్యం , చింతాజ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.