తీన్మార్ మల్లన్న ఇతర కులాలను దూషించడం సరికాదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తీన్మార్ మల్లన్నకు బీ ఫారం ఇచ్చి గెలిపించుకున్నామన్న మంత్రి
జిల్లాకు మంత్రిగా ఉన్న నేను… పార్టీ అభ్యర్థి ఓడిపోవాలని కోరుకుంటానా? అని ప్రశ్న
వ్యక్తిగతంగా విమర్శిస్తే పట్టించుకోనని, ఒక కులాన్ని దూషించడం సరికాదన్న మంత్రి
తీన్మార్ మల్లన్న బీసీ సభను ఏర్పాటు చేసి ఇతర కులాలను దూషించడం సరికాదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీసీ సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేను తప్పుబట్టారు. ఒక సామాజిక వర్గం బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.
గెలుపోటములను నిర్ణయించేది వ్యక్తులు కాదని, ప్రజలని గుర్తించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తీన్మార్ మల్లన్న గెలుపు కోసం పని చేశామన్నారు. భారీ ర్యాలీ నిర్వహించి, అన్ని వర్గాలను మెప్పించి అతనిని గెలిపించుకున్నామని మంత్రి తెలిపారు. తాను జిల్లాకు మంత్రిగా ఉండి పార్టీ నుండి పోటీకి దింపి, అతను ఓడిపోవాలని కోరుకుంటానా? అని ప్రశ్నించారు. బీసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ మంచి నిర్ణయం తీసుకుందన్నారు.
కాంగ్రెస్ బీ ఫారంపై పోటీ చేసి గెలిచిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు అదే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వ్యక్తిగతంగా తనను విమర్శిస్తే పట్టించుకోనని, కానీ ఒక కులాన్ని దూషిస్తే ఏమాత్రం సహించేది లేదని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు ఉన్న ఆస్తులు ఎన్నో చెప్పాలంటే ఓ పుస్తకమే రాయాలని ఎద్దేవా చేశారు. కుల గణన సర్వేలో కవిత మినహా కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. కేంద్రం అంగీకరిస్తే ఫర్వాలేదని, లేకుంటే తమ పార్టీ మాత్రం రిజర్వేషన్లను అమలు చేస్తుందని తెలిపారు.