జ‌గ‌న్‌-కేసీఆర్ స్నేహం.. తెలంగాణ‌ను ముంచింది’..!!

‘జ‌గ‌న్‌-కేసీఆర్ స్నేహం.. తెలంగాణ‌ను ముంచింది’

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ‌ మాజీ సీఎం కేసీఆర్ ల తెర‌చాటు స్నేహ‌మే తెలంగాణ‌ను జ‌ల‌ వివాదాల్లోకి నెట్టింద‌ని వ్యాఖ్యానించారు. వారిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి స్నేహం ఉన్నా.. తెలంగాణ‌కు మేలు చేసేలా ఉండాల‌ని.. కానీ, తీవ్రంగా న‌ష్ట‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించార‌ని అన్నారు. అదే తెలంగాణ స‌మాజానికి మ‌ర‌ణ శాస‌నం రాసింద‌న్నారు. ఈ అధికారం కేసీఆర్‌కు ఎవ‌రు ఇచ్చార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. గ‌తంలోనే జ‌ల వివాదాల‌ పై బ‌ల‌మైన గ‌ళం వినిపించి ఉంటే.. ఇప్పుడు ఈ క‌ష్టాలు వ‌చ్చి ఉండేవి కావ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని హైద‌రాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి.. మీడియాతో మాట్లాడారు. దీనికి ముందు కృష్ణా జలాల విష‌యంలో ఏపీ, తెలంగాణ వాటాలు, ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లు, ఏపీ ఏవిధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న విష‌యాల‌పై రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీడియాకు వివ‌రించారు. అనంత‌రం.. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “బేసిన్లు లేవు.. భేషజాలు లేవని కేసీఆర్ అన్నారు. గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్‌ వరకు నీళ్లు తరలించుకోవచ్చన్నారు. అప్ప‌టి ఏపీ సీఎం జగన్‌తో చేతులు క‌లిపి .. తెలంగాణ గొంతు కోశాడు” అని వ్యాఖ్యానించారు.

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి జ‌ల వాలాల నుంచి హైద‌రాబాద్ నీటి వాటాను వేరు చేయాల్సిన బాధ్య‌త‌ను కేసీఆర్ విస్మ‌రించార‌ని రేవంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌కుపోగా మిగిలిన జ‌లాల‌ను మాత్ర‌మే రెండు రాష్ట్రాల‌కు పంపిణీ చేయాల్సి ఉంద‌ని.. ఈ చిన్న విష‌యాన్ని విస్మ‌రించి.. తెలంగాణ స‌మాజాన్ని కేసీఆర్ ముంచేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన నీటిని.. ముందుగా ఏపీకి త‌ర‌లించేలా వ్య‌వ‌హ‌రించార‌ని, ఆ త‌ర్వాత‌.. తెలంగాణ వాడుకునేలా చేశార‌ని.. దీనివ‌ల్ల తెలంగాణ ఎంత న‌ష్ట‌పోయిందో ఇప్పుడు తెలుస్తోంది. “మీరు మీరు రాసుకోండి.. పూసుకోండి. కానీ, తెలంగాణ స‌మాజాన్ని ఇబ్బంది పెట్టే హ‌క్కు నీకెవ‌రిచ్చారు” అని రేవంత్ రెడ్డి నిల‌దీశారు.

 

Join WhatsApp

Join Now