తాగి నడిపితే జైలుకే..! ఉమ్మడి జిల్లాలో జోరుగా డ్రంక్ డ్రైవ్ తనిఖీలు
కఠిన చర్యలకు సిద్ధమైన పోలీసులు
ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
కామారెడ్డి జిల్లాప్రతినిధి ప్రశ్నఆయుధం నవంబర్ 8
కామారెడ్డి: మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను వేగవంతం చేశారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రతి రాత్రి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తూ మందుబాబులకు చెక్ పెడుతున్నారు. గత మూడు నెలల్లోనే కామారెడ్డిలో వందలాది కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో 103 మందికి రూ.1.01 లక్షల జరిమానాలు, 29 మందికి జైలు శిక్షలు, సెప్టెంబర్‌లో 391 మందికి రూ.3.52 లక్షల జరిమానాలు, 31 మందికి జైలు శిక్షలు, అక్టోబర్‌లో 246 మందికి రూ.2.47 లక్షల జరిమానాలు విధించారు. నవంబర్ మొదటి వారంలోనే 55 మంది చిక్కారు. తాజాగా భిక్కనూరు బైపాస్ వద్ద 27 మందిపై కేసులు నమోదు చేసి ఒక బస్సును సీజ్ చేశారు.
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ “మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం మాత్రమే కాదు, ప్రాణాలతో ఆడుకోవడం కూడా. డ్రంక్ డ్రైవ్‌పై ఎటువంటి రాజీ ఉండదు. ప్రజల భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతాయి” అన్నారు.