*పిఠాపురంలో పోటెత్తనున్న జన సంద్రం.! జనసేన ‘అత్యంత’ అప్రమత్తం.!*
జనసేన పార్టీ వ్యవహారం. సినీ నటుడిగా పవన్ కళ్యాణ్‌కి వున్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? అది, రాజకీయాల్లోనూ కొనసాగుతోంది. ఒకప్పుడు జనసైనికులంటే, కేవలం సినీ అభిమానులు మాత్రమే. కానీ, ఇప్పుడు జనసైన్యం.. అత్యంత బలోపేతమయ్యింది.
గతంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలు వేరు, ఇప్పుడు జరుగుతున్న ఆవిర్భావ సభ వేరు. ప్రస్తుతం టీడీపీతో కలిసి రాష్ట్రంలో అధికారం పంచుకుంటోంది జనసేన. ఏపీ డిప్యూటీ సీఎంగా వున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఏడాది జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని నిర్వహిస్తున్నారు జనసేనాని.
పిఠాపురం సమీపంలోని చిత్రాడ ప్రాంతంలో ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు షురూ అయ్యాయి. మార్చి 14న పవన్ కళ్యాణ్, వేదిక పైనుంచి జనసైనికులకి, రాష్ట్ర ప్రజలకి ఏం సందేశం ఇస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది.
మరోపక్క, తరలివచ్చే జనానికి చేయాల్సిన ఏర్పాట్ల విషయమై జనసేన పార్టీలో మల్లగుల్లాలు నడుస్తున్నాయి. ఐదు లక్షల మందికి పైగానే, జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జనం తరలి వస్తారని పార్టీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేయనున్నారు.
సంబంధం లేని ఘటనల్ని కూడా జనసేన పార్టీకి అంటగట్టి, వైసీపీ దుష్ప్రచారం చేస్తున్న దరిమిలా, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ లేకుండా నిర్వహించడమంటే అంత తేలికైన విషయం కాదు.
జన సంద్రం పోటెత్తుతుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.! కానీ, భద్రత విషయంలో అప్రమత్తంగా.. అత్యంత అప్రమత్తంగా జనసేన పార్టీ వుండాల్సిందే. అధికారంలో వుంది గనుక, భద్రతా ఏర్పాట్ల విషయంలో అంతకు మించి జాగ్రత్తల్ని జనసేన తీసుకునే అవకాశాల్లేకపోలేదనుకోండి..