సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): వాసవి క్లబ్ ద్వారా అనేక సామాజిక సేవలను అందించడం అభినందనీయమని, అదే విధంగా ప్లాస్టిక్ రహిత వ్యాపారాన్ని చేయడం ద్వారా పర్యావరణహితానికి కూడా కృషి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి సమీపంలోని కంది లక్ష్మీనరసింహ కన్వెన్షన్ సెంటర్ లో ఆదివారం జిల్లా గవర్నర్ ఇరుకుల్ల ప్రదీప్ ఆధ్వర్యంలో స్వదీపోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందన్ రావుతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. వాసవి క్లబ్ వారు కేవలం తమ వారికే కాకుండా మొత్తం సమాజం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినందించారు. దీనివల్ల సమాజంలో సేవా తత్పరత పెరుగుతున్నదని చెప్పారు. ధార్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం వల్ల శాంతి నెలకొంటుందని అన్నారు వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలని తమ వ్యాపారాన్ని ఇతర కవర్ల ద్వారా నిర్విఘ్నంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని ఆయన బాటలో ప్రతి ఒక్కరం నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లా గవర్నర్ గా ఇరుకుల ప్రదీప్ అనేక సేవా కార్యక్రమాలు జరపడం అభినందనీయమని తెలిపారు. హైదరాబాదు, రంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి వాసవి క్లబ్ ప్రతినిధులంతా సంగారెడ్డికి తరలిరావడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా సామాజిక సేవ చేయడం అలవర్చుకోవాలని ఎంపీ అన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అన్నారు. తద్వారా తమ ప్రాంతానికి, దేశానికి సేవ చేయాలని పేర్కొన్నారు. వాసవి క్లబ్ గవర్నర్ ఇరుకుల ప్రదీప్ తో పాటు వారి బృందాన్ని అభినందించారు. వాసవి క్లబ్ కు తన వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తానని అంజిరెడ్డి పేర్కొన్నారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. వ్యాపారస్తులు కేవలం డబ్బు సంపాదనకే ప్రాముఖ్యత ఇస్తారని అనుకోవడం సరికాదన్నారు. డబ్బు సంపాదించి దానిని దాచి పెట్టుకోవడమే చూశాము కానీ ఆర్యవైశ్యులు మాత్రం తమ సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయడం అభినందనీయమని అన్నారు. అంతేకాకుండా పేదలకు దుప్పట్లు పంచడం పాఠశాలలకు బల్లాలు ఇవ్వడం వినాయక చవితి సమయంలో మట్టి గణపతులను ఉచితంగా ప్రజలకు పంచడం తాను స్వయంగా చూశానని ఆమె అన్నారు. తాను కూడా తోపాజి అనంత కిషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారని ఆమె వివరించారు. తాను కానీ తన భర్త జగ్గారెడ్డి కానీ ఆర్యవైశ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆమె తెలిపారు. ఇరుకుల్ల ప్రదీప్ స్వాతి దంపతులను ఆమె అభినందించారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ.. కేవలం ఆర్యవైశ్యులకే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు వాసవి క్లబ్ ద్వారా సేవలు అందించడం గర్వకారణం అన్నారు. పేద వర్గాలు ఏ కులం వారైనప్పటికీ, ఏ మతం వారైనప్పటికీ వాసవి క్లబ్ కమిటీ వాళ్లు తమ వంతు సాయం చేస్తున్నారని కొనియాడారు. నిరంతరం సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మునుముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఇప్పటి వరకు తన పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా గవర్నర్ ఇరుకుల్ల ప్రదీప్ తెలిపారు. వివిధ క్లబ్ లకు ఈ సందర్భంగా మెమెంటోలు అందజేశారు. శాలువా కప్పి సత్కరించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాశరావు, ఇతర ముఖ్యులు మానేపల్లి రామారావు, పుల్లూరు ప్రకాష్, చందా శ్రీధర్, దర్శి శ్రీనివాసరావు గుప్తా, సిడిసి మాజీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, గంప శ్రీనివాస్, భానూరి నరసింహులు, మా శెట్టి ఉపేందర్, మ్యాడమ్ రాధా కిషన్, బెజుగం శ్రీనివాస్ జూలకంటి బుచ్చిలింగం, కొంపల్లి విద్యాసాగర్, తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, కెమిస్ట్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల సంతోష్ కుమార్, కంది చందు గుప్తా, వనం నరేందర్ పుట్నాల లక్ష్మణ్, కటకం శ్రీనివాస్, శ్రీరాం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణహితానికి పాటు పడండి: ఎంపీ రఘునందన్ రావు
Published On: November 30, 2025 8:53 pm