ఉద్యోగుల హక్కుల కోసం ఉమ్మడి పోరాటం: రాష్ట్రస్థాయి జేఏసీ ఏర్పాటు

*ఉద్యోగుల హక్కుల కోసం ఉమ్మడి పోరాటం: రాష్ట్రస్థాయి జేఏసీ ఏర్పాటు*

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 16

IMG 20250416 WA2227

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై పోరాడేందుకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటైంది. మేడ్చల్ జిల్లా ఇంతైపల్లి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిళ్లు, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, నెలకొన్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈ జేఏసీని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

ముఖ్యంగా పీఆర్సీ బకాయిలు, డీఏల విడుదల ఆలస్యం, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయకపోవడం, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం, క్యాష్‌లెస్ ఆరోగ్య కార్డుల అమలులో లోపాలు, జీపీఎఫ్ జమలో జరుగుతున్న జాప్యం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో జాప్యం, అహేతుక బదిలీలు, 317 జీవో బాధితుల సమస్యలపై సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

“ఉద్యోగుల హక్కుల కోసం ఇక మౌనంగా ఉండలేము. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే, చట్టబద్ధమైన పోరాటానికి సిద్ధమవుతాం” అని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్థాయి జేఏసీ ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారి వివరాలు:

చైర్మన్: బి. రవి ప్రకాష్ (టి.ఎన్ .జి. ఓ .ఎస్)

సెక్రటరీ జనరల్: జి. వినోద్ కుమార్ (టి .జి .ఓ)

అతిరిక్త సెక్రటరీ జనరల్: వై. రమేశ్వర్ గౌడ్ (పి. ఆర్ .టి .యు .టి. ఎస్)

కో-చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డిపార్ట్‌మెంట్ సెక్రటరీలు మరియు ఇతర కార్యవర్గ సభ్యులుగా వివిధ సంఘాల ప్రతినిధులను ఎన్నుకున్నారు.

ఈ నూతన కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఐక్యతకు చిహ్నంగా నిలవాలని, ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment