కొమ్మినేని అరెస్టుపై జర్నలిస్టుల నిరసన

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాదులో ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై సంగారెడ్డిలో టీయుడబ్ల్యూజే-ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టులో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ వద్ద మంగళవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీయూడబ్ల్యూజే-ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం తగదని అన్నారు. పౌరుల ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడం మంచిది కాదని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఐదు దశాబ్దాలుగా శ్రీనివాసరావు జర్నలిస్టుగా పని చేస్తున్నారని, అనేక హోదాల్లో ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన పాటు పడ్డారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని కుట్రపూరితంగా అరెస్టు చేయడం దారుణం అని అన్నారు. జర్నలిస్టులంతా ఈ చర్యలను ఖండిస్తున్నారని, ఏపీ పోలీసులు తక్షణమే కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా వ్యవహరించడం తగదని, జర్నలిస్టులను రాజకీయాల్లోకి లాగ వద్దని యాదగిరి అన్నారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వినతి పత్రాన్ని అందించి, నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు విష్ణువర్ధన్ రెడ్డి, యోగానంద రెడ్డి, శ్రీధర్, సాక్షి సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ బాల ప్రసాద్, టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆసిఫ్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ సిద్ధిక్, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్, ఇతర నాయకులు నాగరాజు గౌడ్, డేవిడ్, నవాజ్, నరసింహులు, శివ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment