Site icon PRASHNA AYUDHAM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను కొట్టేసిన ఈసీ

IMG 20251014 WA0078

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను కొట్టేసిన ఈసీ

జూబ్లీహిల్స్‌ ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ నేతల ఆరోపణలు

ఒకే ఇంటి నంబర్‌పై భారీగా ఓట్లున్నాయని ఫిర్యాదు

విచారణ జరిపిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్

ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిన అధికారులు

వివాదాస్పద చిరునామాలు అపార్ట్‌మెంట్లవని వెల్లడి

ఓటర్లంతా పాతవారే, ఇటీవల కొత్తగా చేరికలు లేవని స్పష్టీకరణ

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కొన్ని ఇంటి నంబర్ల మీద భారీ సంఖ్యలో ఓట్లు నమోదు అయ్యాయంటూ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు చేసిన ఆరోపణలపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో) ఆర్వీ కర్ణన్ స్పష్టత నిచ్చారు. ఈ వ్యవహారంపై జరిపిన విచారణలో ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన సోమవారం తేల్చిచెప్పారు.

బీఆర్ఎస్ నేతలు ఆరోపించిన చిరునామాలు బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లకు చెందినవని విచారణలో తేలిందని ఆయన వివరించారు. ఒకే ఇంటి నంబర్‌పై ఎక్కువ ఫ్లాట్లు ఉండటంతో ఓటర్ల సంఖ్య అధికంగా కనిపించిందని తెలిపారు. 8-3-231/B/118 చిరునామాలో 50 మంది, 8-3-231/B/119లో 10 మంది, 8-3-231/B/164లో 8 మంది, 8-3-231/B/160లో 43 మంది ఓటర్లు ఉన్నారని, వారంతా అక్కడి ఫ్లాట్లలో నివసిస్తున్నవారేనని స్పష్టం చేశారు.

ఈ ఓటర్లందరి పేర్లు 2023 నుంచే జాబితాలో ఉన్నాయని, వారు గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారని ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. సరైన చిరునామాల ఆధారంగానే వారికి ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశామని, ఇటీవలి నెలల్లో ఈ చిరునామాలపై కొత్తగా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విచారణతో బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలింది.

Exit mobile version