శ్రీరామరక్ష స్తోత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన జడ్జి స్వాతి గౌడ్
రామకోటి రామరాజు సేవలు భక్తికి ప్రతిరూపం
ప్రిన్సిపాల్ జ్యూడిషల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి గౌడ్ ప్రసంశ
రామకోటి భక్త సమాజ సేవలను భద్రాచలం దేవస్థానం గుర్తింపు
రామనామ లిఖనంలో రామరాజు పట్టుదలపై ప్రశంసలు
రామకోటి స్తూపానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని అప్పాల ప్రసాద్ డిమాండ్
రామభక్తి ద్వారా సమరసతా సందేశం పంచిన కార్యక్రమం
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 14 సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీరామకోటి రామరాజు కృషి, సేవా తపస్సు మరోసారి భక్తుల మనసులను ఆకట్టుకుంది. గత మూడు దశాబ్దాలుగా కోట్లాది భక్తులచే రామనామ లిఖనాన్ని చేపట్టి భక్తి పంథాను కొనసాగిస్తున్న రామకోటి భక్త సమాజ సేవలను గుర్తించిన భద్రాచలం దేవస్థానం, భక్తులకు ఉచితంగా అందించే శ్రీరామరక్ష స్తోత్రం పుస్తకాలను పంపిణీ చేసింది.
గజ్వేల్ సరస్వతీ శిశు మందిర్ విద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జ్యూడిషల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ, “రామనామాన్ని కోట్లాది భక్తుల చేత లిఖింపజేయడం చిన్న పని కాదు. రామకోటి రామరాజు కృషి భక్తి, పట్టుదల, సమర్పణకు ప్రతీక” అని అన్నారు.
అఖిల భారత సమరసతా కళావిభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ, “భద్రాచలం నుండి గోటి తలంబ్రాలు తెచ్చి తిరిగి అక్కడికి అందించడం రామభక్తి మహిమ. రామకోటి స్తూప నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే స్థలం కేటాయించాలి” అని కోరారు.
గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ, “భద్రాచలం దేవస్థానం రామకోటి రామరాజు సేవలను గుర్తించి మరో భక్త రామదాసుగా కీర్తించడం గర్వకారణం” అన్నారు.
సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ, “రామనామం మోక్షదాయకం. ఆ నామాన్ని కోట్లాది భక్తులచే లిఖింపజేసి భక్తి మార్గాన్ని చూపిన రామరాజు అభినందనీయుడు” అన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పండరి, సరస్వతీ శిశు మందిర్ ప్రిన్సిపాల్ హరిణిపవన్, విశ్వతేజ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ కొడారి రాజు, లాయర్ నాగిరెడ్డి, రామకోటి సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.