సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ మెంటల్ హెల్త్ డే) సందర్భంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంగారెడ్డి చైర్మన్ జి.భవానీచంద్ర ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.సౌజన్య సంగారెడ్డిలోని సబిత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో న్యాయ అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత, ఒత్తిడి నియంత్రణ పద్ధతులు, సానుకూల దృక్పథం, చట్టపరమైన రక్షణలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి బి.సౌజన్య మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్యం ప్రతి మనిషి సమగ్ర అభివృద్ధికి పునాది అని, ముఖ్యంగా విద్యార్థులలో ఒత్తిడి నిర్వహణ, ఆత్మవిశ్వాసం పెంపుదల, సహనం వంటి అంశాలు అత్యంత అవసరమని సూచించారు.అలాగే మానసిక ఆరోగ్యం శరీర ఆరోగ్యంతో సమానంగా ముఖ్యమైనదని హితవు పలికారు. ఆత్మహత్య నిరోధక చట్టాలు, మానసిక సమస్యలపై ప్రభుత్వ హెల్ప్‌లైన్‌లు, అవగాహన కేంద్రాల గురించి వివరించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మానసిక ఆరోగ్యంపై చైతన్యం పెంపుతో పాటు సమాజంలో సానుకూల ఆలోచనలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన శిబిరం
Oplus_131072