బీసీ రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయి: బింగి స్వామి
– బీసీ, ఎస్సీలు ఒకటై రాజ్యాధికారాన్ని సాధిద్దాం పిలుపు
బీసీలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే పది మంత్రి పదవులు వెంటనే ఇవ్వాలి
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను వాగ్దానాలతో మోసం చేశాయి
బీసీల జనాభా 52%, ఎమ్మెల్యేలు కేవలం 19% మాత్రమే — అవమానకరమని విమర్శ
కేసీఆర్ పాలనలో బీసీ రిజర్వేషన్లు 27% నుంచి 18%కి తగ్గించారంటూ ఆగ్రహం
“మన ఓటు మనం వేసుకొని రాజ్యాధికారం సాధిద్దాం” పిలుపునిచ్చిన బింగి స్వామి
ప్రశ్న ఆయుధం,హైదరాబాద్, అక్టోబర్ 17:
బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను పదే పదే మోసం చేశాయని కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి తీవ్రంగా మండిపడ్డారు. బీసీలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పది మంది బీసీలకు మంత్రి పదవులు కేటాయించాలి అని ఆయన సవాల్ విసిరారు.
“బీసీలకు న్యాయం మాటల్లో కాదు, ఆచరణలో చూపించాలి. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులోనే వెనుకడుగేసింది. 68 సీట్లు ఓసీలకు, కేవలం 20 సీట్లు మాత్రమే బీసీలకు ఇవ్వడం ఘోర అన్యాయం,” అని స్వామి విమర్శించారు.
టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను విస్మరించిందని ఆరోపిస్తూ, “వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీసీ నేతకు ఇవ్వడం ద్వారా నిజమైన గౌరవాన్ని చాటుకోవాలి” అని సూచించారు.
“రాష్ట్రంలో బీసీల జనాభా 52 శాతం ఉన్నా, ఎమ్మెల్యేల్లో బీసీల వాటా కేవలం 19 శాతం మాత్రమే ఉంది — ఇది సిగ్గుచేటు,” అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో బీసీ రిజర్వేషన్లు 27% నుంచి 18%కి తగ్గించి, వేలాది సర్పంచ్ పదవులను తొలగించడం ద్వారా బీసీల గొంతు కోశారని విమర్శించారు.
ఇక బీఆర్ఎస్ నేత కవిత తాజాగా బీసీ హక్కుల కోసం చేస్తున్న ఉద్యమం “రాజకీయ నాటకం తప్ప మరొకటి కాదని” ఆయన ఎద్దేవా చేశారు.
“రాబోయే ఎన్నికల్లో బీసీ ద్రోహులను బీసీలు తగిన బుద్ధి చెబుతారు. మన ఓటు మనమే వేసుకొని మన రాజ్యాధికారాన్ని సాధించాలి” అని బింగి స్వామి పిలుపునిచ్చారు.