జస్టిస్ జి.నరేందర్ తీర్పులు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం..!

*జస్టిస్ జి.నరేందర్ తీర్పులు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం*

*రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్*

: న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రాలను ప్రతిబింబించే విధంగా న్యాయమూర్తి జిస్టిస్ జి.నరేందర్ ఇచ్చిన పలు తీర్పులు భవిష్యత్తు తరాల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు మార్గదర్శకంగా ఉంటాయని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందజేస్తున్న జస్టిస్ జి.నరేందర్ ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులై వెళుతున్న సందర్బంగా మంగళవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ జి.నరేందర్ సేవలను కొనియాడారు. హైకోర్టు న్యాయమూర్తిగా స్వల్పకాలమే వీరు పనిచేసినప్పటికీ, పెద్ద సంఖ్యలో పలు కేసులను సునాయాసంగా పరిష్కరించి అందరికీ ఆదర్శనంగా నిలిచారన్నారని అభినందించారు. పలు కేసుల్లో వీరు ఇచ్చిన తీర్పులు న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రాలపై వీరికి ఉన్న అపారమైన జ్ఞానాన్ని, అవగాహనను ప్రతిబించే విధంగా ఉన్నాయని, అవి భవిష్యత్తు తరాల వారికి మార్గదర్శంగా ఉంటాయనడంలో ఎటు వంటి సందేహం లేదని ప్రశంసించారు. ఏ.పి. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా జస్టిస్ జి.నరేందర్ స్వల్ప కాలమే పనిచేసినప్పటికీ రెండు సార్లు జాతీయ లోక్ అథాలత్ లను నిర్వహించి దీర్ఝకాలికంగా పెండింగ్ లో ఉన్న పలు కేసులను పరిష్కరించారని అభినందించారు. ఈ ఏడాది సెప్టెంబరు 14 న నిర్వహించిన జాతీయ లోక్ అథాలత్ లో దాదాపు 78,937 పెండింగ్ కేసులను, 48,106 ప్రిలిటిగేషన్ కేసులను పరిష్కరించారన్నారు. ఈ నెల 14 న నిర్వహించిన మరో జాతీయ లోక్ అథాలత్ లో రికార్డు స్థాయిలో 1,22,977 కేసులను పరిష్కరించారని అభినందించారు. విజయవాడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో వైద్య శిభిరాన్ని నిర్వహించి 57 మంది బదిరులకు వినికిడి పరికరాలు పంపిణీచేయించారని, అంధులకు వైద్య పరీక్షలు చేయించి ఇద్దరు అంధులకు తిరిగి చూపు వచ్చేలా వీరు ప్రయత్నించడం ఎంతో అభినందనీయమైన విషయమన్నారు. ఈ ఏడాది అక్టోబరు, నవంబరు మాసాల్లో జాతీయ మహిళా కమిషన్ సమన్వయంతో దాదాపు 5,460 మంది మహిళలకు న్యాయ అవగాహన సదస్సులను నిర్వహించారన్నారు. వీరి నేతృత్వంలోని లీగల్ సర్వీసెస్ అధారిటీ మండల లీగల్ సర్వీసుల ద్వారా దాదాపు 110 దివ్యాంగుల పాఠశాలలు, గృహాల్లోని దివ్యాంగుల జీవన స్థితిగతులు, ఆహార భద్రత, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై తనిఖీ చేయించారన్నారు. పరిపాలనా మరియు న్యాయ పరంగానే కాకుండా పలు కమిటీల్లో సభ్యులుగా వ్యవహరిస్తూ వీరు న్యాయ వ్యవస్థకు గుణనీయమైన సేవలు అందజేశారని ప్రశంసించారు. ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా మరింత ఉత్తమ మైన సేవలు అందజేసి మంచి పేరుప్రఖ్యాతలు పొందాలని ఆయన ఆకాంక్షించారు.

ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులై వెళుతున్న జస్టిస్ జి.నరేందర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేవలం 14 మాసాలే విధులు నిర్వహించినప్పటికీ తోటి న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ వ్యవస్థ అధికారులు, సిబ్బంది చూపి ప్రేమాభిమానాలు మరువలేనివన్నారు. వీటికి తోడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తనపై మంచి ప్రేమాభిమానలు చూపడంతో పాటు తన విధులను సంతృప్తి కరంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందజేయడం వల్లే తాను ఈ 14 మాసాలు తన విధులను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, తాను సాధించిన విజయాల్లో సగం క్రెడిట్ వారికే చెందుతుందంటూ కృతజ్ఞతలు తెలిపారు. తాను సాధించిన విజయాల్లో బార్ సభ్యుల సహకారం కూడా మరువలేనిదంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం మరియు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు మాట్లాడుతూ జస్టిస్ జి.నరేందర్ న్యాయ వ్యవస్థకు ఉత్తమమైన సేవలు అందించారని కొనియాడారు.

అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈవీడ్కోలు కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయ మూర్తులు, అదనపు అడ్వకేట్ జనరల్ ఇ.సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు, పలువురు ఇతర రిజిష్ట్రార్లు,సీనియర్ న్యాయవాదులు,బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు,ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ,ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now