*కువైట్‌లో కాకినాడ మహిళపై దారుణం.. యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్చిన యజమానులు*
రెండు నెలల క్రితం కువైట్ వెళ్లిన కాకాడ లక్ష్మి
వేతనంగా 150 దీనార్లకు బదులు 100 దీనార్లు ఇచ్చిన యజమానులు
ప్రశ్నించినందుకు యాసిడ్ పోసి పిచ్చాసుపత్రిలో చేర్చిన వైనం
లక్ష్మిని వెనక్కి తీసుకురావాలని కోరుతున్న కుటుంబ సభ్యులు
భర్త మరణించడంతో జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన ఓ మహిళ యజమానుల చేతిలో యాసిడ్ దాడికి గురైంది. ఆసుపత్రి సిబ్బంది ఫోన్ ద్వారా బాధిత కుటుంబానికి సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త మృతి చెందాడు. దీంతో పొట్ట కూటి కోసం కువైట్ వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం వైఎస్సార్ జిల్లాకు చెందిన ఒక ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లింది. అక్కడ ఓ ఇంట్లో పనిచేస్తే 150 దీనార్లను వేతనంగా ఇస్తారని ఒప్పందం కుదిరింది.
అయితే, ఉద్యోగంలో చేరిన తర్వాత 100 దీనార్లు మాత్రమే ఇవ్వడంతో యజమానులను లక్ష్మి ప్రశ్నించింది. దీంతో వారు కోపంతో లక్ష్మిపై యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్పించారు. పది రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బాధితురాలు కోలుకున్న తర్వాత జరిగిన విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి చెప్పింది. దీంతో వారు ఆమెతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. అలాగే, కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు.
కాగా, లక్ష్మి పాస్‌పోర్టు యజమానుల వద్ద ఉండిపోవడంతో, తమపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటేనే దానిని తిరిగి ఇస్తామని వేధిస్తున్నట్టు లక్ష్మి తెలిపింది. దీంతో ఏం చేయాలో తెలియక ఆసుపత్రిలోనే మగ్గిపోతోంది. లక్ష్మిని కువైట్‌కు పంపిన ఏజెంట్‌ను సంప్రదిస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి లక్ష్మిని ఆదుకోవాలని కోరుతున్నారు.