కామారెడ్డిలో ఘనంగా కాళోజి జయంతి
కామారెడ్డి, సెప్టెంబర్ 9 (ప్రశ్న ఆయుధం):
కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాళోజి చిత్రపటానికి పూలమాల అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.
సాహిత్య వర్గ ప్రతినిధులు మాట్లాడుతూ – “కాళోజి కవిత్వాన్ని ఆయుధంగా మలిచారు. ప్రజల ఆశలు, బాధలకు స్వరం ఇచ్చారు. ఆయన రచనలు సామాజిక చైతన్యానికి మార్గదర్శకం” అని అభిప్రాయపడ్డారు.
తదుపరి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ – “తెలంగాణ సాహిత్యానికి, సంస్కృతికి కాళోజి నారాయణరావు అగ్రగణ్యులు. ప్రజల కోసం ఆయన రాసిన ప్రతి పద్యం ఒక చైతన్య గీతం. తెలుగు సాహిత్యం కోసం చేసిన కృషి చిరస్మరణీయం” అని అన్నారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డీబీసీడీఓ జయరాజ్, అసిస్టెంట్ బీసీడీఓ చక్రధర్, సాహితీ మిత్రులు, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, నాగభూషణం, గంగారాం, నాగరాజు, నరేష్, పవన్ అశ్వక్తో పాటు జిల్లా అధికారులు, పలు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.