కేంద్ర మంత్రి నితిన్ గడ్కారిని కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే. కే వి ఆర్.
కామారెడ్డి, సెప్టెంబర్ 9 (ప్రశ్న ఆయుధం):
కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వరదల కారణంగా కామారెడ్డి నియోజకవర్గంలోని రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటి పునరుద్ధరణకు కేంద్ర సహకారం అవసరమని విజ్ఞప్తి చేశారు.
అలాగే కామారెడ్డి పట్టణానికి ఔటర్ రింగు రోడ్ అత్యవసరమని వివరించి, దీని కోసం ఇప్పటికే సిద్ధం చేసిన ప్లాన్ మ్యాప్‌లు, డీపీఆర్‌ను మంత్రికి అందజేశారు. సుమారు రూ.510 కోట్ల వ్యయంతో 54 కిలోమీటర్ల పొడవులో నిర్మించబడే ఈ రింగు రోడ్డు, పట్టణ ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా అభివృద్ధికి బాటలు వేస్తుందని ఎమ్మెల్యే వివరించారు.
జిల్లా ప్రజల దీర్ఘకాల అవసరాన్ని నెరవేర్చేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గడ్కారిని కోరారు.