*బ్రేకింగ్: సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!!*
న్యూఢిల్లీ: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు.
ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ఎల్జీ సక్సేనాను కలిసి కేజ్రీవాల్ రాజీనామా లేఖను అందించారు. ఆప్ నూతన శాసనసభా పక్ష నేతగా అతిశీని మర్లేనాను ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా లెప్టినెంట్ గవర్నర్కు కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ వెంట మంత్రులు, ఆప్ ముఖ్యనేతలు లెప్టినెంట్ గవర్నర్ నివాసానికి వెళ్లారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్పై బయటికి వచ్చిన విషయం తెలిసిందే.
అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం, సుప్రీంకోర్టు షరతులు విధించడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ (సెప్టెంబర్ 17) సీఎం పదవికి రిజైన్ చేశారు. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి.. ప్రజల తీర్పు ఆధారంగానే సీఎం పదవి చేపడతానని.. అప్పటి వరకు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనని కేజ్రీవాల్ శపథం చేశారు. కేజ్రీవాల్ రాజీనామాతో ఢిల్లీ నూతన సీఎంగా ఆప్ కీలక నేత, మంత్రి అతిశీ ఎన్నికైంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇవాళ ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.