సోషల్ మీడియాతో న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారు..!
మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు..!
న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. కేసుల తీర్పులను ప్రభావితం చేసేందుకు కొందరు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారన్నారు. దానిపై అప్రమత్తంగా ఉండాలని అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కారణంగా 20 సెకన్ల ఆధారంగా అభిప్రాయాన్ని ఏర్పరచాలని కోరుకుంటున్నారని.. ఇది ప్రమాదకరమన్నారు. కోర్టుల నిర్ణయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించేరందుకు ప్రతి పౌరుడికి హక్కు ఉందని.. అయితే, కోర్టు నిర్ణయాలను దాటి న్యాయమూర్తులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న సమయంలో ‘ఇది నిజంగా భావ ప్రకటన స్వేచ్ఛా? అనే ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుందన్నారు. కోర్టుల్లో నిర్ణయం తీసుకునే ప్రక్రియ చాలా తీవ్రమైందని.. దీన్ని అర్థం చేసుకునే ఓపిక, సహనం ఎవరికీ లేదన్నారు.
ఇది చాలా చిన్న విషయం అయినా.. భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న చాలా తీవ్రమైన సమస్య అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా ట్రోల్స్ న్యాయమూర్తులపై ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. న్యాయస్థానాల్లో తీసుకుంటున్న నిర్ణయాలను మార్చేందుకు ప్రత్యేక వర్గాలు ప్రయత్నిస్తున్నాయని.. ఈ క్రమంలో న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టాల చెల్లుబాటును నిర్ణయించే అధికారం రాజ్యాంగ న్యాయస్థానాలకు అప్పగించినట్లు గుర్తు చేశారు. అధికార విభజన చట్టాన్ని రూపొందించే పనిని శాసనసభ చేస్తుందని, చట్టాన్ని అమలు చేయడం కార్యనిర్వాహక వర్గం ద్వారా జరుగుతుందన్నారు. న్యాయవ్యవస్థ చట్టాన్ని అర్థం చేసుకుని వివాదాలను పరిష్కరిస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారం జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు ఉందన్నారు.
విధాన రూపకల్పన అనేది శాసనసభ పని, కానీ దాని చెల్లుబాటును నిర్ణయించడం న్యాయస్థానాల పని, బాధ్యత అన్నారు. అదే సమయంలో కొలీజియం వ్యవస్థను సమర్థించారు. దీనిపై అపోహలు ఉన్నాయని.. వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం ప్రత్యేక పాత్ర పోషిస్తుందదన్నారు. న్యాయమూర్తుల రాజకీయరంగ ప్రవేశంపై ప్రశ్నించగా.. రాజ్యాంగం, చట్టంలో ఎలాంటి నిషేధం లేదన్నారు. పదవీ విరమణ తర్వాత సమాజం జడ్జిగానే చూస్తుందని.. ఇతర పౌరులకు అనుకూలమైన విషయాలు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా న్యాయమూర్తులకు సరిగా ఉండవన్నారు. పదవీ విరమణ తీసుకునే నిర్ణయాలు న్యాయమూర్తిగా ఆయన పనిని అంచనా వేసే వారిపై ప్రభావం చూపుతాయో లేదో అనేది ప్రధానంగా ప్రతి న్యాయమూర్తి నిర్ణయించుకోవాలన్నారు.