Site icon PRASHNA AYUDHAM

వైభవంగా కొమురవెల్లి మల్లన్న అగ్నిగుండాలు..!!

IMG 20250325 WA0069

*_వైభవంగా కొమురవెల్లి మల్లన్న అగ్నిగుండాలు..!!_*

కొమురవెల్లిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

కొమురవెల్లి : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంతో మల్లన్న వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అగ్నిగుండాల కార్యక్రమంలో మొదటగా ఆదివారం అర్ధరాత్రి 11.45 గంటలకు అర్చకులు తోటబావి వద్ద గణపతిపూజ, వీరభద్రపళ్లేరం, వీరభద్ర ఖడ్గం, దుర్గామాత పూజలు చేయగా.. అగ్నిగుండాలు నిర్వహించే స్థలంలో భూమి పూజ, కలశపూజ, జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంతరం సమిధలను కాల్చి నిప్పులు తయారు చేశారు. అనంతరం ఉదయం 5.10 గంటలకు అగ్నిగుండం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అగ్నిగుండాల పర్యవేక్షణకు వచ్చిన డాక్టర్‌ సిద్దేశ్వరానందగిరి మహరాజ్‌కు పాదపూజ చేశారు. అనంతరం అర్చకులు వీరభద్రుడి పళ్లేరం, వీరభద్రుడి ఖడ్గం పట్టుకొని 5.35 గంటలకు అగ్నిగుండాలను దాటుకుంటూ వెళ్లారు. తర్వాత శివసత్తులు, భక్తులు ఒక్కొక్కరిగా అగ్నిగుండాలు దాటారు.

అగ్నిగుండాల అనంతరం సోమవారం ఉదయం 11 గంటలకు గర్భగుడిలో మల్లికార్జునస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం, జంగమార్చన, మహాదాశీర్వాదం, మంగళహారతి, తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. కార్యక్రమంలో హుస్నాబాద్‌ ఏసీపీ సతీశ్‌, ఈవో రామాంజనేయులు, ఏఈవోలు బుద్ధి శ్రీనివాస్, చేర్యాల సీఐ ఎల్.శ్రీను, ఎస్సై రాజు గౌడ్, సూపరింటెండెంట్‌ శ్రీరాములు పాల్గొన్నారు.

Exit mobile version