Site icon PRASHNA AYUDHAM

తగ్గేదే లేదని కొండా దంపతులు

Picsart 25 07 03 22 26 38 549

తగ్గేదే లేదని కొండా దంపతులు – మీనాక్షి నటరాజన్ సమక్షంలో వివరణ

వరంగల్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. కొండా దంపతులు ఏ మాత్రం వెనక్కి తగ్గే ఉద్దేశం లేకుండా తమ స్థానం స్పష్టం చేశారు. ఇతర నేతలు “కొండా దంపతులా, మేమా?” అని అల్టిమేటం ఇచ్చే స్థాయికి చేరడంతో చివరికి మీనాక్షి నటరాజన్ మధ్యవర్తిత్వం చేపట్టింది.

కొండా మురళి, కొండా సురేఖ ఇద్దరినీ పిలిచి వివరాలు అడిగారు. వాళ్లు పదహారు పేజీల నివేదిక సమర్పించారు. అందులో వరంగల్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలపైన, వాళ్ల కార్యకలాపాలపైనా ఆరోపణలు చేశారు.

తర్వాత మీడియా ముందు మాట్లాడి తగ్గేది లేదని సంకేతాలు ఇచ్చారు. “తాను బలహీన వర్గాల ప్రతినిధి. ఎవరికీ భయపడను” అని కొండా మురళి చెప్పాడు. “ఒకరిపై కామెంట్లు చేయమని చెప్పరు. రేవంత్ రెడ్డి మరో పదేళ్లు సీఎంగా ఉండాలి. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి” అని విధేయత ప్రకటించారు.

“మంత్రికి సంబంధం లేకుండా ఆలయ కమిటీలు పెడుతున్నారు. మంత్రికి తెలియకుండా పోస్టింగులు ఇస్తున్నారు. కడియం శ్రీహరి అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నాడు. పని చేసే వాళ్లపై రాళ్లు వేస్తున్నారు. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం” అని ఆరోపణలు చేశారు.

తన కుమార్తె రాజకీయాలను కొండా సురేఖ సమర్థించింది. “ఎవరి రాజకీయాలు వాళ్లవి. నా కుమార్తె పరకాల నుంచి రాజకీయాలు చేయాలనుకుంటుంది. అందులో తప్పేం లేదు” అని చెప్పింది.

“కాంగ్రెస్‌ను బతికించడం, రాహుల్‌ను ప్రధాని చేయడం, రేవంత్‌ను పదేళ్లు సీఎంగా ఉంచడం మా లక్ష్యం. లోకల్ బాడీ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో అన్నీ సీట్లు గెలుస్తాం. ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినా, ఇవ్వకపోయినా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను గెలిపించేది మా బాధ్యత” అని కొండా మురళి స్పష్టం చేశాడు.

మీనాక్షి నటరాజన్ సమక్షంలో కూడా కొండా దంపతులు తగ్గే రాకుండా, ఇతర నేతలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు హైకమాండ్ నిర్ణయం చేయాలి.

 

 

Exit mobile version