సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): భాగ్యనగర తొలి మేయర్, ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకుడు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జంటనగరాల అభివృద్ధికి ఆధ్యుడు అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. శనివారం కొరవి కృష్ణస్వామి 138వ జయంతి పురస్కరించుకొని చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నీలo మధు ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజుల ముద్దుబిడ్డ, పేదోళ్ల మహానేత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ అని అన్నారు. ఆయన భాగ్యనగర అభివృద్ధికి అనితర సాధ్యంగా కృషి చేశాడన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, కవిగా, జర్నలిస్టుగా, పేదోళ్ల నాయకుడిగా ప్రజల మనసు దోచుకున్నాడని తెలిపారు. హైదరాబాద్ తొలి మేయర్ గా సేవలందించిన సమయంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసి మహానగర అభివృద్ధిపై చెరగని ముద్ర వేసిన ఘనత ఆయనకే సొంతమన్నారు. ముదిరాజ్ జాతి ఐక్యత కోసం ముదిరాజ్ మహాసభ సంఘాని స్థాపించి మన జాతి అభివృద్ధి కోసం ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. ఆ మహానేత స్ఫూర్తితో మనమంతా ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు.ఆయన అందించిన పోరాటస్ఫూర్తితో బహుజనులంతా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని సమాజ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో టీఎంపీఎస్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.