*యూట్యూబ్ చానల్స్‌తో కేటిఆర్ తప్పుడు ప్రచారం…*
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎంపీ గాంధీ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. కోడి గుడ్డుపై ఈకలు పీకినట్లు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.సైకో రాము (కేటిఆర్) కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారని.. రామప్పగుడి దగ్గర అత్యుత్సాహంతో ఎవరో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్ళు కడిగి ఉండొచ్చునని, దానికి తెలంగాణ మహిళల ఆత్మ గౌరవం ఏమైందంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ట్విట్ చేశారని మండిపడ్డారు. పదేండ్లు వాళ్ళ ఇంటి ఆడబిడ్డ గురించి తప్ప ఏ ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడలేదని ఎంపీ చామల విమర్శించారు.
ఇప్పుడు కేటిఆర్ మహిళల ఆత్మ గౌరవం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కలెక్టర్లతో కాళ్ళు కడిగించుకున్న దౌర్భాగ్య పరిస్థితి మీదని.. జనాన్ని తప్పుదోవ పట్టించాలని కేటిఆర్ రోజు ఎదో ఒకటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తుంటే.. కేటిఆర్ డిస్టర్బ్ చేస్తున్నారని, గతంలో దండుకున్న వందల కోట్ల రూపాయలతో కొన్ని యూట్యూబ్ చానల్స్‌తో.. మార్పుడు వీడియోలతో కేటిఆర్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. మంత్రి కొండా సురేఖ ఏ సందర్భంలో మాట్లాడారో దానికి ఆమే సమాధానం చెబుతారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
కాగా శుక్రవారం ఉదయం మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్ రావు ఇంటిలో ఉన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న హరీష్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు..