కవిత బెయిల్ నేపథ్యంలో.. బండి సంజయ్‌కి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కడం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విజయమని, కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ లాయర్లకు అభినందనలు తెలియజేస్తున్నానంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ మీరు ఒక కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉండి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై నిందలు వేస్తున్నారు!!. అది మీ హోదాకు తగదు. మీ స్థానానికి తగినది కాదు’’ అని కేటీఆర్ విమర్శించారు.భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను గమనించి కోర్ట్ ధిక్కార చర్యలను ప్రారంభించాలని తాను కోరుతున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.ఇంతకీ బండి సంజయ్ ఏమన్నారంటే?ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించిన వెంటనే కేంద్ర మంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ లాయర్లకు అభినందనలు అని పేర్కొన్నారు. ‘‘అలుపెరగకుండా మీరు చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికీ దక్కిన విజయం. బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్‌పై బయటకు వస్తున్నారు. కాంగ్రెస్ నేత రాజ్యసభకు వెళ్తారు. కవిత బెయిల్ కోసం తొలుత వాదించిన అభ్యర్థిని రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా రాజ్యసభకు నామినేట్ చేయడం, దానికి మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతను ప్రదర్శించారు. నేరంలో భాగస్వాములైనవారికి అభినందనలు’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.