*ఏసీబీ 80 ప్రశ్నలు, ఈడీ 40 ప్రశ్నలు.. తప్పు చేసినట్టు రుజువు చేస్తే ఏ శిక్షకైనా రెడీ : కేటీఆర్*
: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు 80 ప్రశ్నలు, ఈడీ అధికారులు 40 ప్రశ్నలు అడిగారు.. అన్నింటికి సమాధానం చెప్పానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగారని కేటీఆర్ పేర్కొన్నారు. బషీరాబాగ్ లో ఈడీ విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా ఏసీబీకి రేవంత్ రెడ్డి దొరికిండు కాబట్టే నా మీద కూడా ఏసీబీ కేసు పెట్టిచ్చిండు. రేవంత్ రెడ్డి మీద ఈడీ కేసు ఉంది కాబట్టే నా మీద ఈ ఈడీ విచారణ జరిపిస్తున్నారు. అంతిమంగా నిజం, న్యాయం, ధర్మం నిజాయితీనే గెలుస్తుంది. భారత న్యాయవ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద నాకు విశ్వాసం ఉంది. ఇవాళ కాకుండా ఇంకో నాలుగు రోజులకైనా ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలుస్తాయన్న విశ్వాసం నాకుంది అని కేటీఆర్ చెప్పారు.
8 గంటలు వాళ్లు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగారు. తప్పు చేయలేదు.. అరపైసా అవినీతి జరగలేదు. తప్పు చేసి ఉంటే రుజువు చేయండి.. ఏ శిక్షకైనా సిద్ధమని అధికారులకు చెప్పాను. పారదర్శకంగా నిధుల బదిలీ జరిగింది ఇంకెక్కడ మనీ లాండరింగ్ అని ఏసీబీ, ఈడీ అధికారులను అడిగాను. ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. నేను తప్పు చేయలేదు.. తప్పు చేయబోను. ఇందులో అర పైసా అవినీతి కూడా జరగలేదు అని కేటీఆర్ మరోసారి తేల్చిచెప్పారు…