Headlines :
-
మజ్లిస్‌ను దూరం చేసుకున్న కేటీఆర్
-
అసదుద్దీన్ ఓవైసీ కేటీఆర్‌పై విమర్శలు
-
గ్రేటర్ ఎన్నికల ముందు బీఆర్ఎస్-మజ్లిస్ సంబంధాలు
మజ్లిస్ రాజకీయ వ్యూహాల గురించి తెలిసి కూడా ఆ పార్టీని నిందించారు కేటీఆర్. ఫలితంగా అసదుద్దీన్ ఓవైసీ మొత్తం బీఆర్ఎస్ జాతకాన్ని బయట పెడతానని మండిపడ్డారు. కాంగ్రెస్ తో కలిసి మజ్లిస్ వెళ్తోందని .. కేటీఆర్ ఇటీవల ఆరోపించారు. దీనిపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మద్దతుతోనే గ్రేటర్ లో గెలిచారని ఆ విషయం మర్చిపోయి దూషిస్తున్నారని విమర్శించారు. అసదుద్దీన్ బీఆర్ఎస్ తో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఎన్నికల సమయంలో మామును మళ్లీ సీఎంను చేసుకుందామంటూ కేసీఆర్ కోసం ముస్లింల ఓట్లు వేయించారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.
మజ్లిస్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటుంది. అది ఆ పార్టీ రాజకీయ వ్యూహం. పాతబస్తీలో ఇతరుల్ని రానివ్వకుండా తాము ఇతర చోట్లకు వెళ్లకుండా అప్రకటిత ఒప్పందం చేసుకుని రాజకీయంగా లబ్ది పొందుతూ ఉంటారు. ప్రభుత్వం నుంచి మేళ్లు పొందుతూ ఉంటారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయమే చేశారు. అయితే ఓవైసీని కేసీఆర్ గరిష్టంగా ఉపయోగించుకున్నారు. అయితే ఓవైసీ మాత్రం జాతీయ రాజకీయాల విషయంలో కేసీఆర్ వెంట నడవలేదు.
గ్రేటర్ ఎన్నికలు రానున్న సమయంలో ఇలా బీఆర్ఎస్ పార్టీపై మజ్లిస్ అధినేత ఆగ్రహం వ్యక్తం చేయడం చిన్న విషయం కాదు. గ్రేటర్ పరిధిలో మజ్లిస్ గెలిచే చోట ఆ పార్టీ పోటీ చేస్తుంది. గెలవలేని చోట ముస్లిం ఓట్లను అప్రకటిత మిత్రపక్షానికి వేయించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడా అడ్వాంటేజ్ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ స్వయంగా ఇచ్చినట్లయింది.