కుబేరుల బొజ్జలు నిండుతున్నాయ్

*కుబేరుల బొజ్జలు నిండుతున్నాయ్*

*ట్రిలియనీర్లుగా మారుతున్న బిలియనీర్లు సంపదే కాదు… *పెత్తనమూ పెరుగుతోంది.

దిగజారుతున్న పేదల బతుకులు

*ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ : ప్రపంచంలో కోటీశ్వరుల సంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. 2023తో పోలిస్తే గత సంవత్సరం వారి సంపద రెండు ట్రిలియన్‌ డాలర్లు పెరిగి పదిహేను ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. అంటే 2023లో కంటే 2024లో వారి సంపద మూడు రెట్లు పెరిగిందన్న మాట. ప్రపంచంలోని కుబేరులందరూ సోమవారం కొలరాడోలోని స్కై రిసార్ట్‌ పట్టణంలో వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరులపై ఓ ఆసక్తికరమైన అధ్యయనం వెలుగు చూసింది. ప్రతి ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) వార్షిక సమావేశం ప్రారంభమయ్యే రోజు ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ అసమానతలపై ఓ నివేదిక విడుదల చేస్తుంది. 1990 నుండి పేదల సంఖ్యలో ఎలాంటి మార్పు రానప్పటికీ కోటీశ్వరుల సంపద మాత్రం అమాంతం పెరిగిపోతోందని ఈ నివేదిక తెలిపింది. గత సంవత్సరం ఆసియాలో కుబేరుల సంపద ఏకంగా 299 బిలియన్‌ డాలర్లు పెరిగిందని, రాబోయే దశాబ్ద కాలంలో కనీసం ఐదుగురు ట్రిలియనీర్లు ఉంటారని ఆక్స్‌ఫామ్‌ చెబుతోంది.

పెరుగుతున్న కోటీశ్వరుల జాబితా

ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో గత సంవత్సరం 204 మంది చేరారు. అంటే ప్రతి వారానికి సగటున సుమారు నలుగురు వ్యక్తులు కుబేరులు అవుతున్నారన్న మాట. గత సంవత్సరం ఒక్క ఆసియాలోనే కోటీశ్వరుల జాబితాలో కొత్తగా 41 మంది చేరారు. ఉత్తర అమెరికా, యూరప్‌లోని సంపన్న, శక్తివంతమైన దేశాలలో నివసిస్తున్న ఒక శాతం కుబేరులు 2023వ సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థల ద్వారా యూరప్‌, ఉత్తర అమెరికా వెలుపల ఉన్న ప్రాంతాల నుండి గంటకు 30 మిలియన్‌ డాలర్లు కొల్లగొట్టారని ఆక్స్‌ఫామ్‌ తన నివేదికలో తెలియజేసింది. కోటీశ్వరుల సంపదలో 60 శాతం వారసత్వం, గుత్తాధిపత్యం, క్రోనీ సంబంధాల నుండి పొందినదేనని ‘టేకర్స్‌… నాట్‌ మేకర్స్‌’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఆక్స్‌ఫామ్‌ ఎత్తిచూపింది. అత్యంత సంపన్నులైన వారి ఆర్జనలో ఎక్కువభాగం గౌరవప్రదంగా పొందిందేమీ కాదని అంటూ అసమానతలను తగ్గించేందుకు, అధిక సంపదకు స్వస్తి పలికేందుకు, కొత్తగా పుట్టుకొచ్చిన దొరతనాన్ని అంతం చేసేందుకు వీలుగా ప్రపంచంలోని కుబేరులపై ఆయా దేశాల ప్రభుత్వాలు పన్నులు విధించాలని హక్కుల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పెత్తనమూ పెరుగుతోంది

గత ఏడాది కుబేరుల సంపద రోజుకు సగటున 5.7 బిలియన్‌ డాలర్ల చొప్పున పెరిగింది. 2023లో బిలియనీర్ల సంఖ్య 2,565 నుండి 2,769కి పెరిగింది. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన పది మంది సంపద రోజుకు సగటున వంద మిలియన్‌ డాలర్ల చొప్పున పెరిగింది. ఒకవేళ వారు రాత్రికి రాత్రే తమ సంపదలో 99 శాతాన్ని కోల్పోయినప్పటికీ వారు కోటీశ్వరులుగానే మిగులుతారని ఆక్స్‌ఫామ్‌ తేల్చి చెప్పింది. నేడు అసమానతలు గరిష్ట స్థాయికి చేరడం వెనుక అక్రమ సంపద, వలసవాదం శక్తివంతంగా పనిచేస్తున్నాయి. కోటీశ్వరుల సంపద ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి కూడా ఇవే కారణం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కొందరి చేతిలో బందీగా ఉండిపోయింది. బిలియనీర్లకు అడ్డుకట్ట వేయడంలో జరుగుతున్న వైఫల్యం కారణంగా ట్రిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. కోటీశ్వరుల సంపద మాత్రమే పెరగడం లేదు… దానితో పాటు వారి పెత్తనం కూడా పెరుగుతోందని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమితాబ్‌ బెహర్‌ చెప్పారు.

‘కుబేరుడైన దేశాధ్యక్షుడు. ఆయనను తీసుకొచ్చి మద్దతు ఇచ్చిన ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి ఎలాన్‌ మస్క్‌… ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను నడపబోతున్నారు. మేము ఈ నివేదికను ఒక మేలుకొలుపుగా అందిస్తున్నాము. కొద్దిమంది చేతిలో ఉన్న అంతులేని సంపద కారణంగా ప్రపంచంలోని సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు’ అని అమితాబ్‌ బెహర్‌ తెలిపారు.

వారసత్వంగా వచ్చిందే

ఆక్స్‌ఫామ్‌ అంచనా ప్రకారం కోటీశ్వరుల సంపదలో 36 శాతం వారసత్వంగా వచ్చి పడిందే. 30 సంవత్సరాల లోపు వయసున్న ప్రతి కోటీశ్వరుడికీ సంపద వారసత్వంగానే సంక్రమించిందని ఫోర్బ్స్‌ పరిశోధన తేల్చింది. ఇవాళ కోటీశ్వరులుగా ఉన్న వెయ్యి మంది రాబోయే రెండు మూడు దశాబ్దాలలో 5.2 ట్రిలియన్‌ డాలర్ల సంపదను తమ వారసులకు అప్పగిస్తారని యుబిఎస్‌ అనే అంతర్జాతీయ సంస్థ అంచనా. యూరప్‌లోని అత్యంత సంపన్నులు పేద దేశాలను దోచుకోవడం, చారిత్రక వలసవాదం కారణంగా కుబేరులయ్యారని ఆక్స్‌ఫామ్‌ తెలిపింది.

ధనిక దేశాల ఆధిపత్యం

అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి ధనిక దేశాలు 69 శాతం ప్రపంచ సంపద పైన, 77 శాతం కోటీశ్వరుల సంపద పైన పెత్తనం చెలాయిస్తున్నాయి. ప్రపంచ కుబేరుల్లో 68 శాతం సంపన్న దేశాలలో నివసిస్తున్న వారే. అయితే ప్రపంచ జనాభాలో వారి సంఖ్య కేవలం 21 శాతమే. విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం ప్రతి దేశంలోనూ డబ్బు అవసరమవుతుంది. కానీ ఆ సొమ్ము సంపన్నుల బ్యాంక్‌ ఖాతాలకు చేరుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థకే కాకుండా మానవ జాతికి కూడా నష్టదాయకమేనని బెహర్‌ తెలిపారు. రోజుకు కేవలం 6.85 డాలర్లతో జీవిస్తున్న వారి సంఖ్యలో 1990 నుండి పెద్దగా మార్పేమీ రాలేదని ప్రపంచబ్యాంక్‌ చెబుతోంది. అయితే కోవిడ్‌ సమయంలో… అంటే 2021లో కూడా కోటీశ్వరుల సంపద 5.8 ట్రిలియన్‌ డాలర్ల మేర పెరిగింది.

Join WhatsApp

Join Now