కూకట్పల్లి మెట్రో పిల్లర్ 813 వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం విజ్ఞప్తి
-పాదచారులకు తీవ్ర అసౌకర్యం… వాహనదారులకు గందరగోళం
కూకట్పల్లి, ఆగస్టు 07( ప్రశ్న ఆయుధం): కూకట్పల్లి మెట్రో పిల్లర్ నెం.813 వద్ద రోజుకో వేలాది మంది పాదచారులు మారుమూల ప్రాంతాల నుంచి వస్తూ ప్రాణాలపై చాటువేసుకుంటూ రోడ్డు దాటి ప్రయాణిస్తున్నారు. పక్కనే ఉన్న బస్టాప్, మెట్రో స్టేషన్, వాణిజ్య కేంద్రాలు కారణంగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు జనసంచారం అధికంగా ఉంటుంది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ప్రజల రక్షణ కోసం అక్కడ తక్షణమే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (ఎఫ్‌ఓబీ) నిర్మించాలని పత్రికా వేదికగా స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్‌లు దీనిపై స్పందించి, సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఈ ప్రాంతంలో ఎఫ్‌ఓబీ నిర్మాణం జరగకపోవడం వల్ల పాదచారులకు ప్రమాదభరితమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు రోడ్డు దాటేటప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటే, పాదచారులకు భద్రత కలుగడమే కాకుండా ట్రాఫిక్ సమస్యకు కూడా మార్గం లభిస్తుందని స్థానికుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో చిరుతడిగా రోడ్డు దాటే పాదచారులు వాహనదారులకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. అనేకసార్లు ప్రమాదాలు తృటిలో తప్పిన సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయి.