Site icon PRASHNA AYUDHAM

జగన్ మెడకు లడ్డూ కల్తీ వ్యవహారం..

జగన్ మెడకు లడ్డూ కల్తీ వ్యవహారం.. హైదరాబాద్ లో వైసీపీ అధినేతపై కేసు.

 

లడ్డూ తయారీలో జరిగిన అవకతవకలపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ నేత జగన్ పై హైదరాబాద్ లో కేసు నమోదు అయ్యింది. హైకోర్టు న్యాయవాది కే. కరుణ్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్టులలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీనిపై కలత చెందిన కరుణ్ సాగర్ మాజీ సీఎం జగన్ పై సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ చైర్మన్ సహా పాలక మండలి సభ్యుల పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా అందించే లడ్డూ దైవత్వానికి ప్రతీక అని, ఇది ఒక విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టేనని తెలిపారు. అలాగే పవిత్రతో పాటు నాణ్యతలో శ్రీవారి లడ్డూ ప్రసిద్ధి పొందిందని, లడ్డూను తాను అత్యంత గౌరవిస్తానని, ఈ చర్య గత ప్రభుత్వ కుట్రలో భాగమేనని కరుణ్ సాగర్ ఆరోపించారు.

 

ఇక తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం వైసీపీ అధినేత జగన్ మెడకు చుట్టుకుంటుంది. గత ప్రభుత్వ హాయాంలోనే తిరుమల ప్రసాదం లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఇచ్చారు. దీంతో ఈ అంశంలో జగన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసాదం తయారీలో కూడా అవినీతికి పాల్పడటమేంటని అధికార పక్ష నేతలు మండిపడుతుండగా.. మరోవైపు కలియుగ దైవంగా కొలిచే శ్రీవారిని అప్రతిష్టపాలు చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు కాగా.. ఇప్పుడు ఏకంగా జగన్ పైనే కేసు నమోదు కావడం ఆయన్ను చిక్కుల్లో పడేసినట్టు అయ్యింది. ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందో వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రకటించింది.

Exit mobile version