జాతీయ రహదారుల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేస్తాం
— కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
— ప్రాజెక్టులలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఎస్ ఆదేశాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 20
జిల్లాలో 765 D, 161 BB జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు.
శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఐడిఓసి కార్యాలయం నుండి పాల్గొన్నారు.
సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ, జాతీయ రహదారులు, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర విభాగ భూసేకరణ పనులను సమీక్షించారు. రహదారి నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజల రవాణా సౌలభ్యం, ఆర్థికాభివృద్ధికి రహదారులు కీలకమని గుర్తు చేస్తూ, సంబంధిత శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.