అంతర్రాష్ట్ర దొంగల ముఠా నాయకుడి అరెస్టు.
చోరీకి గురైన నగదు 6 లక్షలు దొరికింది 20వేలు.
మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు.
విలేకరుల సమావేశంలో ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి వెల్లడి.
నిజామాబాద్ జనవరి 27
వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా లోని నాయకుడిని అరెస్టు చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి వెల్లడించారు. చోరీకి సంబంధించిన వివరాలు సోమవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మహారాష్ట్రకు చెందిన కరణ్ సింగ్, కరణ్ సింగ్ బాపూరి, మనోహర్ సింగ్,అజయ్ సింగ్ లు కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ ముఠా చోరీలకు పాల్పడే ముందు ద్విచక్ర వాహనాలను చోరీ చేసి ఆ వాహనాలపై అర్ధరాత్రి వారిని గుర్తుపట్టకుండా మంకీ క్యాప్ లు ధరించి ఇనుపరాడ్ తో షట్టర్ కు ఉన్న తాళాలను కట్టర్ తో తొలగించి షట్టర్ ను పైనకు ఎత్తి ముందుగా ఒక వ్యక్తిని లోపలికి పంపించి చోరీకి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ దొంగల ముఠా నగరంలోని పూసల గల్లీతోపాటు హైదరాబాద్ రోడ్ లో గల శ్రీనగర్ కాలనీ లోని మెడికల్ లో చోరీకి పాల్పడ్డారని, అదేవిధంగా చంద్రశేఖర్ కాలనీలోని ఓ మెడికల్ షాపులో , సుభాష్ నగర్ లోని ఒక షాపు వద్ద చోరీకి పాల్పడి సీసీ కెమెరాకు సంబంధించిన డివిఆర్ ని తీసుకొని వెళ్ళిపోయినట్లు ఏసీ పీ వెల్లడించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటో టోన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు ఇందులో భాగంగా నగరంలోని గంజ్ లో అనుమానస్పదంగా తిరుగుతున్న కరణ్ సింగ్ ని అదుపులోకి తీసుకొని విచారించారు. అదేవిధంగా ఈనెల తొమ్మిదవ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఒక ఇంటి ముందు నిలిపిన హోండా షైన్ ను నకిలీ తాళంతో దొంగిలించారన్నారు. దొంగిలించిన వాహనంతో రైల్వే స్టేషన్ ప్రాంతంలో గల తిలక్ గార్డెన్ కాంప్లెక్స్లో మెడికల్ షాప్ లో చోరీకి పాల్పడి 85వేల నగదును దొంగిలించారు. అదే రోజు పూసల గల్లీలోని ఒక బట్టల షాపు షట్టర్ తాళాలు తొలగించి రెండు లక్షల 40 వేల రూపాయలు నగదును ఎత్తుకొని వెళ్ళారని తెలిపారు. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారని మరో ముగ్గురి కోసం ప్రత్యేక బలగాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ 11 దొంగతనం కేసులలో ఆరు లక్షల సొత్తు చోరీకి గురికాగా నిందితుడి వద్ద నుంచి 20వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, పరార్ లో ఉన్న ముగ్గురు నిందితులు దొరికితే మిగతా సొత్తు కూడా దొరికే అవకాశాలు ఉన్నాయని అన్నారు. నిందితుడు నుండి చోరీకి గురైన వాహనంతో పాటు చోరీకి ఉపయోగించిన పరికరాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.ఈ విలేకరుల సమావేశంలో వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి పాల్గొన్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు.