కేరళ వరద బాధితులకు అండగా నిలుద్దాం
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్
సిద్దిపేట ఆగస్టు 13 ప్రశ్న ఆయుధం :
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో 300 మందికి పైగా మృత్యువాతపడ్డారని, వందలాది మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, కొంతమంది జాడ కానరావడం లేదని బాధిత ప్రజలకు జరిగిన నష్టం పూడ్చలేనిదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు. కేరళ వరద బాధితులకు అండగా నిలించేందుకు మంగళవారం స్థానిక కొమురవెల్లి మెయిన్ రోడ్డు షాపుల వద్దకు రైతు సంఘం కార్యకర్తలు నిధుల సమీకరణ చేపట్టారు. అనంతరం మూడ్ శోభన్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన కేరళ ప్రజలకు ప్రజలంతా అండగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి పూర్తిస్థాయి నిధులు అందించాలని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రానికి సంఘీభావంగా విరివిగా ఆర్థిక సహకారం అందజేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా బాధితులకు ఉదారంగా విరాళాలిచ్చి సంఘీభావాన్ని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నక్కల యాదవ రెడ్డి, బద్దిపడగ కృష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, రాంనగర్ మాజీ సర్పంచ్ తాడూరి రవీందర్, రైతు సంఘం నాయకులు ఆరుట్ల రవీందర్, బూర్గం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.