6.8,9 తరగతి పిల్లలు తరగతి బాలికపై అఘాయిత్యం చేసి,చంపి మృతదేహాన్ని మాయం చేశారు.. ప్రేమించలేదని అమ్మాయిపై అకృత్యం. నడిరోడ్డుపై ప్రేమోన్మాది స్టూడెంట్ని నరికివేత. “ఓ అబ్బాయిల తల్లిదండ్రులారా ఆడపిల్లల్ని ఎలా చూడాలో మీ పిల్లలకు నేర్పండి. ఆడపిల్లలకు తల్లి గర్భంలోనే స్వేచ్ఛ” అని అత్యాచారానికి గురై చావు బతుకుల మధ్య ఇచ్చిన ఒక బాలిక వాంగ్మూలం. నడిరోడ్డుపై స్నేక్స్ రైడింగ్,బడి వయసులోనే ఆల్కహాల్, మత్తుపదార్థాలకు బానిస అవుతున్నారు. బడిలో మందలించారని ఉపాధ్యాయులపై పిల్లలు దాడి… ఇలాంటి వార్తలు నిత్యం పేపర్లలో,సోషల్ మీడియాలో చదువుతుంటే నా దేశం ఏమైపోతుందనే ఆవేదన కలగక మానదు. అమ్మఒడిలో, బడిలో మానవీయ విలువలు నేర్పాల్సి ఉంటే… పని ఒత్తిడి, పోటీతత్వం, ర్యాంకులు, మార్కులు,కెరియర్ గైడెన్స్ల చుట్టూ ఉపాధ్యాయులను విద్యార్థులను, వారి తల్లిదండ్రులని బొంగరంలా తిప్పేస్తున్నారు. పిల్లల హింస ప్రవృత్తికి ఎవరు కారకులు? ఇంటి పరిసరాలా? తల్లిదండ్రులా? ఉపాధ్యాయులా? సమాజమా? మీడియానా? ఎవరికి వారు దీనికి కారణం మీరేనని ఎదుటివారి వైపు వేలెత్తి చూపుతున్నారు. టీవీ డిబేట్లు,చర్చలు, వాదోపవాదాలు.. అలా చేయాలి… ఇలా చేయాలి అని సలహాలు,సూచనలు ఇస్తున్నారు. ఇలా చేస్తున్నాను,మీరు ఇలా చేయండి పిల్లలు కచ్చితంగా మారతారు అని చెప్పేవారు చాలా అరుదుగా ఉన్నారు. ఫలానా జంతువు అంతరించిపోతున్న జాతి లాగా ప్రకటనలు వస్తూ ఉంటాయి. మానవీయ విలువలు అంతరించిపోయిన మానవుడిగా మారకముందే మేల్కోవాలి. ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టిన ఒక ఇద్దరు డాక్టర్స్ వృత్తిరీత్యా బిజీబిజీ. ఒక్క క్షణం తీరిక లేదు. అలా అని కోట్ల ఆస్తిని పోగు చేసుకున్నది లేదు.కోట్లమంది ప్రజల యొక్క మమకారాలను పంచుకోవడం తప్ప .ఒక్కగాని ఒక్క కొడుకు,అనివార్యంగా హాస్టల్లో పెట్టాల్సి వచ్చింది.అయినా ఎక్కడా వారు బాధపడలేదు.. వారానికో లెటర్ చిన్నోడికి ప్రేమతో… ఉత్తరం వ్రాసారు. బాగా చదువుకో పక్కనోడికంటే పోటీపడి ఫస్ట్ ర్యాంకు తెచ్చుకో. కోట్లు సంపాదించు. అని ఎక్కడ చెప్పలేదు.నిత్యజీవితంలో మానవతా విలువల్ని ఎలా పెంపొందించు కోవాలో పిల్లవాడికి నేర్పారు. ఇవాళ ఒక పరిపూర్ణ మానవుడు ఎలా ఉంటాడో అలా తన సొంత పిల్లనవాడిని తయారు చేసుకున్నారు. తన సొంత పిల్లవాడినే కాదు తన ప్రగతి నర్సింగ్ హాస్పిటల్ని ఒక అద్భుతమైనటు వంటి బాలల వికాస కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సెల్ఫోన్కి బలి చేస్తున్న తల్లిదండ్రులారా… సాంకేతిక పరిజ్ఞానమే సమాజానికి ఇక అంతిమమని చెప్పే పాలకులారా…. మూస పద్ధతిలో పాఠం చెప్పే కొద్దిమంది ఉపాధ్యాయులారా… కెరియర్ గైడెన్స్ చుట్టూ మనిషిని బంధిస్తున్నటువంటి మేధావులారా ఒక్కసారి చిన్నోడికి ప్రేమతో లో…డాక్టర్ ఏ. విజయలక్ష్మి,డాక్టర్ శివ బాబు వైద్యులు, వీరికి ఒక చిన్నాడు.. తప్పని పరిస్థితుల్లో హాస్టల్లో పెట్టాల్సి వచ్చింది. ప్కృతితో సహజీవనం ఎలా చేయాలో అద్భుతంగా ఉత్తరం పిల్లాడికి రాశారు. అందరితో కలిసి మెలిసి ఎలా జీవించాలో, ప్రతి చిన్న విషయానికి అసంతృప్తి చెందకుండా ఇతరులలో ఉన్న లోపాల్ని, అలవాట్లకు అసహనాన్ని గురి కాకుండా వారిలో మంచిని మాత్రమే స్వీకరించి సహజీవనం చేయటం ఎలా, దాని ద్వారా ఎలా సంతోషంగా ఉండగలం మొదటి ఉత్తరంలోనే రాశారు. ఆటలు ప్రయోజనాలు మీద ఒక ఉత్తరం. జట్టుగా ఉండటం, కలిసికట్టుగా ఉండటం, గెలుపు కోసం సమిష్టిగా కృషి చేసేవంటి లక్షణాలు ఆటలలో ఎలా అలవాడతాయో చెప్పారు. శాస్త్ర పరిశోధనలో బిజీగా గడిపే ఐనీస్టిన్ శాస్త్రవేత్త “చుట్టుప్రక్కలు ఎవరూ ఉండరు చెట్టు పడిపోతుంది శబ్దం వస్తుందా” అని లాంటి చిన్న చిన్న ప్రశ్నలకు కూడా ఓపిగ్గా పిల్లలకి ఉత్తరాల రూపంలో సమాధానాలు రాసేవారని చెబుతారు. ఎంత ఎదిగినా, ఎంతగా రాణించినా మంచి ప్రవర్తన కలిగి ఎలా ఉండాలో విద్యతోపాటు వినయం అనే ఉత్తరంలో రాస్తారు. వ్యర్ధాలతో తిరిగి వస్తువుల్ని రీసైకిలింగ్ చేయడం, ప్రకృతిలో వనరులను ఎలా ఆదా చేయడం, కాలుష్యాన్ని ఎలా తగ్గించవచ్చు అని స్వచ్ఛ భారత్ ఉత్తరంలో చక్కగా చెప్తారు. శారీరిక అంగవైకల్యం ఉన్నప్పటికీ మానసికంగా, దృఢంగా ఉండి, కఠిన శ్రమతో ఉన్నత లక్ష్యాలను సాధించిన ఆదర్శనీయుల జీవితం రూజ్ వెల్ట్,బ్రెయిలీ, హెలెన్ కెల్లర్, థామస్ అల్వా ఎడిసన్,కాక్స్ గురించి అద్భుతంగా పిల్లలకు నేర్పటం ద్వారా ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చో చెప్తారు. ఒక సమస్య వచ్చినప్పుడు ముందు, వెనక అన్ని విధాల క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చదరంగం ఆట నేర్పుతుందని చదరంగం ఉత్తరంలో చక్కగా వివరిస్తారు. సాహస బాలల నుండి సమయస్ఫూర్తి, పరోపకారం, ధైర్యసహస్యాలు వంటి లక్షణాలను నేర్చుకుని నీవు కూడా ఇతరులకు సహాయపడాలి అనే ఆకాంక్షను సాహస బాలల్లో వ్యక్తపరుస్తారు. చదివే కాదు ఆటలు,నృత్యాన్ని నేర్చుకోవాలని మరొక ఉత్తరంలో చెప్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎదుటివారి చెప్పినవి సావధానంగా వినాలని,ఎదుటి వారి కళ్ళల్లోకి చూస్తూమాట్లాడాలని, ఎదుటివారు మాట్లాడేటప్పుడు ఆటంకపరచకుండా అర్థం కాని వాటిని తర్వాత ప్రశ్నించి తెలుసుకోవాలని, ఇతరులకు చెప్పేటప్పుడు మృదువుగా మాట్లాడాలని, ఎప్పుడూ చిరునవ్వుతో చక్కటి సంభాషణ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆకాంక్షిస్తూ చిరునవ్వు ఉత్తరంలో చెప్తారు. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని అనే సినారె గజిల్ ను కూడా ఒక ఉత్తరంలో గుర్తు చేస్తారు.ఏకాగ్రత,ప్రశ్నించే తత్వం, ఆకర్షించే విధంగా మాట్లాడటం మ్యాజిక్ ద్వారా చేయొచ్చని చెప్తారు. మాస్టారు,చార్లీ చాప్లిన్,వేమన,మండేలా, సుందరయ్య, కరాటే, ప్రశ్నించు, పిల్లల పత్రికలు, శ్రమైక జీవనం, మనిషి దురాశ ప్రకృతికి చేటు,స్టాంపులు నాణేలు,క్యూబా, చుట్టూ ఉన్న మొక్కలు,భిన్నత్వంలో ఏకత్వం, పరీక్షల్లో జాగ్రత్తలు, అంతరిక్షం, ఆహారం అవగాహన… ఇలా సృజించని అంశం లేదు. ఒక పరిపూర్ణమైన మనిషిని తయారు కావడం కోసం పిల్లలకు చిన్నప్పుడు ఏమి నేర్పాలో, ఎలా నేర్పాలో ప్రకృతి నుంచి ఎలా పాఠాలు నేర్చుకోవాలో, పని సంస్కృతిని ఎలా అలవాటు చేసుకోవాలో,కష్టం విలువ ఎంతో.. ఇలాంటి ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.డబ్బు నీది. సెల్ ఫోన్ నీది భావాలు మాత్రం ఎదుటి వారివి ఎక్కించుకుంటున్నాం. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే దాకా కనీసం ఒక గంట అయినా సెల్ఫోన్ లేని పెద్దోళ్ళు లేరు. పిల్లలకు సైతం ఈ విష సంస్కృతి నేర్పిస్తున్నాము. వారికి మానవత్వం ఎవరు నేర్పాలి. ఎప్పుడూ నేర్పాలి? అసలు నేర్పే సమయం ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులకే ఉండటం లేదు కదా. మరి పిల్లలు మానవుడిగా ఎలా తయారవుతారు.? అందుకే పుస్తకాల, కథ ద్వారా శ్రమ వల్లే వస్తువులకు విలువ, నైతికతే మానవత్వానికి సాక్ష్యం, అవసరం మేరకే వస్తువుల కొనుగోలు,పోరాడకుండా ఏమీ రాదు, ప్రశ్నించడం మానవ సహజ లక్షణం, అందరూ సమానమే, అందరికీ సంపద చెందాలి, పేదవాని కోపం సమాజ మార్పుకు ఉపయోగం అనే అంశాలు విద్యార్థి దశలో నేర్పిద్దాం.పుట్టడం గొప్పకాదు, బ్రతకడం గొప్ప… ముంచి బతకటం గొప్ప కాదు. మంచిని పంచి బతకడం గొప్ప,నీకు నీవే గొప్ప అనుకోకు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప” అంటారు మహాకవి శ్రీశ్రీ.. పాపం పుణ్యం/ ప్రపంచ మార్గం/ కష్టం సౌఖ్యం శేషార్ధాలు/ ఏమీ ఎరగని పువ్వుల్లారా/ అయిదారేడుల పాపల్లారా/ మీదే మీదే సమస్త విశ్వం / మీరే లోకపు భాగ్య విధాతలు… అని శైశవ గీతి లో శ్రీశ్రీ అంటారు. భవిష్యత్లో భాగ్య విధాతలకు ఏమి నేర్పాలో పాఠశాలలలో, ఇంటిలో, నేర్పుదాం.. సమస్త విశ్వం పిల్లోడికి ప్రేమతో భాగ్యవిధాతలకు అప్ప చెబుదాం……