రుణమాఫీ ఎఫెక్ట్.. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే!!
హైదరాబాద్, సెప్టెంబర్ 2 :
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనని అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రస్తుతం రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే అంతే సంగతులని, రుణమాఫీ, రైతుభరోసా నిధులు జమ చేశాకే ఎన్నికలకు వెళ్లాలని పార్టీ సీనియర్లు, పలువురు ఎమ్మెల్యేలు సీఎంకు సూచించినట్టు తెలిసింది. వాస్తవంగా రైతు రుణమాఫీ మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు, నమ్మకం పెట్టుకున్నది. దీనికి విపరీతమైన ప్రచారం చేయడంతోపాటు సంబరాలు కూడా నిర్వహించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అయింది. అరకొర రుణమాఫీపై రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను, అధికారులను నిలదీస్తున్నారు. నిరసనలు తెలుపుతున్నారు. ఒకే దఫాలో రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 40 శాతం రైతులకు మాత్రమే మాఫీ చేశారని, మిగిలిన 60 శాతం మంది రైతుల పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. రుణమాఫీ అయిన వారి కంటే కానీ వారే ఎక్కువగా ఉన్నారని, ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని క్షేత్రస్థాయి క్యాడర్ సమాచారం ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఎన్నికలకు వెళ్లాలంటే రాబోయే రోజుల్లో రుణమాఫీకి రూ.14 వేల కోట్లు, రైతు భరోసాకు దాదాపు రూ. 10 వేల కోట్లు అవసరమవుతాయని వ్యవసాయ అధికారులు లెక్కలు వేశారు. వీటికే మొత్తం రూ.24వేల కోట్ల వరకు అవసరమవుతాయి. హామీ ఇచ్చినట్టుగా ఆసరా పింఛన్‌ను రూ. 4 వేలకు పెంచాల్సి ఉంటుంది. దీనికి అదనంగా రూ. 1000 కోట్లు అవసరమవుతాయని తేల్చారు. వీరి సంఖ్య దాదాపు 45 లక్షలుగా ఉన్నది. కాబట్టి పెన్షన్ పెంచి ఇవ్వకుంటే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని, వారు బీఆర్‌ఎస్‌వైపు మళ్లే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. దీనికితోడు ఉద్యోగులకు ఐదు డీఏలు, కల్యాణలక్ష్మిలో భాగంగా తులం బంగారం ఇలా అనేకం అంశాలు ప్రభుత్వం మెడపై కత్తిలా వేలాడుతున్నాయి. ప్రజలు ఇంత ఆగ్రహంగా ఉన్న సమయంలో ఎన్నికలకు వెళ్తే పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు చెప్పినట్టు తెలిసింది. ఎన్నికలను త్వరగా నిర్వహిద్దామని మొదట అనుకున్నా, ఇప్పట్లో ఎన్నికల జోలికి వెళ్లవద్దన్న ఆలోచన చేసి వెనక్కి తగ్గినట్టుగా చెప్తున్నారు. దీంతో వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం కల్లా రుణమాఫీ, రైతు భరోసా నిధులను జమచేసి ఆ తరువాత ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం.
కొత్త కమిషన్‌తో మరింత ఆలస్యం?
రెండు రోజుల క్రితమే బీసీ కమిషన్ గడువు ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ట్రిపుల్ టెస్ట్‌కు డెడికేటెడ్ కమిషన్‌ను నియమించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న కమిషన్ గడువు పొడిగించి ఉంటే త్వరగా నివేదిక వచ్చి ఉండేది. కానీ ఆ కమిషన్ గడువు పొడగించలేదు. ఇది కూడా ఎన్నికలు ఇప్పట్లో లేవనడానికి ఆధారమని చెప్తున్నారు. కొత్త కమిషన్ నియామకానికి ప్రభుత్వం మొగ్గు చూపినట్టుగా సమాచారం.
కమిషన్ నియామకం తరువాత ట్రిపుల్ టెస్ట్, సుప్రీంకోర్టు తీర్పు, ఇతర రాష్ట్రాలు ఏ విధంగా చేశాయి? తదితర అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుం ది. ఈ తరువాత గ్రామాల్లో ఓటరు జాబితా ఆధారంగా కానీ, లేదంటే బీసీ గణన ప్రకారం కానీ రిజర్వేషన్ ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 21 తరువాత తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. ఆ తరువాత ఓటరు జాబితా ప్రకారమా లేదా జనాభాలో బీసీ గణన చేయడమా అన్నది నిర్ణయించాల్సి ఉంటుంది. కులగణన అయితే కనీసం ఆరేడు నెలల సమయం పడుతుందని, ఓటరు జాబితా ప్రకారం తీసుకున్నా కనీసం రెండు నెలల సమయం పడుతుందని బీసీ సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా కాకుండా హడావుడిగా మమ అనిపించేస్తే జరిగే పొరపాట్లపై కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి కోర్టుకు వెళ్తే ప్రక్రియ మొదటికి వచ్చే అవకాశం ఉందని, ఇప్పట్లో ఎన్నికలు ఉండవని చెప్తున్నారు. ఇలా ఏ విధంగా చూసినా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో ఉండవని, వచ్చే సంవత్సరమే జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
42 శాతానికి పడని అడుగులు
రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి స్పష్టత రాలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో అర్భాటంగా ప్రకటించారు. అచరణకు వచ్చేసరికి ప్రభుత్వం కుంటి సాకులు చెప్తున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వపరంగా రిజర్వేషన్లు సాధ్యం కాదని, పార్టీపరంగా రిజర్వేన్లు ఇద్దామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడాన్ని బట్టి చూస్తే బీసీలకు గతంలో కంటే రిజర్వేషన్లు పెరిగే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.