హైడ్రా కూల్చివేతలు బ్యాంకర్లలో రికవరీ భయం.. NOC ఉంటేనే లోన్లు!
గ్రేటర్ పరిధిలో చెరువులను ఆక్రమంచి ఎఫ్ టీఎల్ పరిధిలో, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారులకు హైడ్రా(డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెస్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)వణుకుపుట్టిస్తోంది. వరుస కూల్చివేతలతో దూసుకెళ్తోంది. చెరువులను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేయడంలో హైడ్రా వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల మాదాపూర్ లో ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న నటుడు నాగార్జునకు చెందిన ‘ఎన్’ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.హైడ్రా దూకుడుతో బ్యాంకర్లకు లోన్ రికవరీ భయం పట్టుకుంది.అధికారులు కూల్చివేస్తున్న అక్రమ బిల్డింగ్ ల్లో చాలావరకు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని నిర్మించనవే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కూల్చివేతలతో లోన్ రికవరీ ఎలా అనే ఆందోళన బ్యాంకర్లలో నెలకొంది. కొత్తగా నిర్మించే బిల్డింగ్ లకు లోన్లు ఇవ్వాలంటేనే బ్యాంకర్లు వెనుకాడే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పలు బ్యాంకులకు చెందిన అధికారులు సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కొత్తగా నిర్మించే వెంచర్లు, బిల్డింగ్ లు, అపార్ట్ మెంట్లకు లోన్లు ఇవ్వాలంటే ‘హైడ్రా’ నుంచి ఎన్ వోసీ తీసుకొని రావాలని నిర్మాణదారులకు బ్యాంకర్లు కండీషన్ పెడుతున్నట్లు తెలుస్తోంది.బాచుపల్లి మండల పరిధి ప్రగతినగర్ పరిధిలోని 134 సర్వే నంబరులో 3.03 ఎకరాల్లో విస్తరించిన ఎర్రకుంటలో ఐదంతస్తుల్లో నిర్మిస్తున్న మూడు అపార్ట్ మెంట్లను ఇటీవల హైడ్రా అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామున మొదలైన కూల్చివేతలు రాత్రి 11 వరకు సాగాయి. ఆ నిర్మాణాలు ఎర్రకుంట చెరువకు చెందిన ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవెల్),బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయని అధికారులు గుర్తించారు. అయితే, ఈ అపార్ట్ మెంట్లను 70 శాతం బ్యాంక్ లోన్లతోనే నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ లోన్లు ఎలా రికవరీ చేయాలనే టెన్షన్ ఆయా బ్యాంక్ అధికారులకు పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా నిర్మించే వాటికి విలేజ్ మ్యాప్, ఓల్డ్ మ్యాప్, ఎఫ్ టీఎల్ క్లియరెన్స్ తో పాటు హైడ్రా నుంచి ఎన్ వోసీని తీసుకొని రావాలని నిర్మాణదారులకు బ్యాంకర్లు చెబుతున్నట్లు సమాచారం.