ఇంద్రనగర్ కాలనీలో వోడాఫోన్ టవర్ నిర్మాణాన్ని ఆపిన స్థానికులు
“ఇళ్ల మధ్య టవర్ వద్దు… చిన్న పిల్లల ఆరోగ్యానికి ముప్పు” అంటూ ఆందోళన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 24
సోమవారం, కామారెడ్డి మున్సిపాలిటీ 24వ వార్డు ఇంద్రనగర్ కాలనీలో వోడాఫోన్ టవర్ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఏకే గార్డెన్ సమీపంలో టవర్ నిర్మాణ పనులు ప్రారంభించడంతో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ—
100కి పైగా ఇళ్ల మధ్యలో టవర్ నిర్మిస్తే రేడియేషన్ ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్యానికి ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కాలనీలో చిన్న చిన్న పిల్లలు ఎక్కువగా ఉన్నందున, ఇళ్ల మధ్యలో టవర్ నిర్మించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. గత వారం మున్సిపల్ కార్యాలయంలో టవర్ నిర్మాణంపై ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వెంటనే మున్సిపల్ అధికారులు జోక్యం చేసుకుని టవర్ నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరారు.
“ఒక ఇంటి యజమాని అనుమతితో టవర్ పెడితే, చుట్టుపక్కల 100 ఇళ్ల ప్రాణాలు ఎవరివి? ఇలా టవర్ పెడితే మేమే మా ఇళ్లను వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది” అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు.