అంధుల జీవితాల్లో వెలుగు నింపిన లూయీ బ్రెయిల్ స్ఫూర్తిదాయకుడు
217వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ జనవరి 07:
లూయీ బ్రెయిల్ 217వ జయంతి వేడుకలను బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబంలో జన్మించి చిన్నతనంలోనే కంటి చూపును కోల్పోయిన లూయీ బ్రెయిల్ స్వయంకృషితో బ్రెయిల్ లిపిని రూపొందించి, ప్రపంచవ్యాప్తంగా అంధుల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.
లూయీ బ్రెయిల్ జయంతిని పురస్కరించుకొని హాజరైన అంధ వికలాంగులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అంధులు పాటలు పాడటం, తబలా వాయించడం చూసిన కలెక్టర్ వారి నైపుణ్యాలను అభినందిస్తూ, ఇలాంటి ప్రతిభను మరింతగా అభివృద్ధి చేసుకొని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు.
జిల్లా న్యాయ సేవాధికారి నాగరాణి గారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని, అంధులు ఎలాంటి నిరాశకు లోనుకాకుండా ధైర్యంగా జీవన ప్రయాణాన్ని కొనసాగించాలని సూచించారు.
ఈ సందర్భంగా వివిధ వికలాంగుల సంఘాల నాయకులు జిల్లాలో లూయీ బ్రెయిల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించగా, జిల్లా కలెక్టర్ స్పందిస్తూ విగ్రహ స్థాపనకు హామీ ఇచ్చి జిల్లా సంక్షేమ అధికారిని అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల గారు, మహిళా కమిషన్ సభ్యురాలు సుధా లక్ష్మి గారు, సూపరింటెండెంట్ అరుణ్ భాస్కర్ గారు, వికలాంగుల సంఘాల నాయకులు హరిసింగ్, కుమ్మరి సాయిలు, బల్రాజ్ గౌడ్, శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.