*విద్యార్థుల ఉన్నతికి కృషి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 24
విద్యార్థులు ఇష్టంగా చదువుకుని మంచి ఫలితాలను సాధించడానికి అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు.
గురువారం నాడు, శామీర్‌పేట్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యా శాఖాధికారి విజయ్ కుమార్ తో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల వివరాలను హెడ్ మాస్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అదనపు తరగతి గదులు, టాయిలెట్లు అవసరమని హెడ్ మాస్టర్ తెలపగా, ఇంజనీర్లతో అంచనాలు వేయించి త్వరగా ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం, సిలబస్ ఎంతవరకు పూర్తయిందని, మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగారు. హెడ్ మాస్టర్ అడిగినవి కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. అన్ని సౌకర్యాలు బాగున్నాయని, మధ్యాహ్న భోజనం కూడా బాగుంటుందని విద్యార్థులు సమాధానమిచ్చారు.
కలెక్టర్ పాఠశాలనంతా కలియ తిరిగి పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్‌ను కూడా సందర్శించారు. విద్యార్థులకు అర్థం కాకుండా గంటల తరబడి తరగతులు తీసుకోవడం కంటే, వారికి సులువుగా సారాంశం అర్థమయ్యేలా ఎలా బోధించాలనే అంశాలను గ్రహించాలని టీచర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో శామీర్‌పేట్ తహసీల్దార్ యాదగిరిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.