Site icon PRASHNA AYUDHAM

మాగనూర్ ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టు సీరియస్.. అధికారులకు పిల్లలు లేరా అంటూ ప్రశ్న..!!

మాగనూర్ ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టు సీరియస్.. అధికారులకు పిల్లలు లేరా అంటూ ప్రశ్న..!!*

హైదరాబాద్: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా?

అంటూ హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా సీరియస్ అంశమని సీజే ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, ఫుడ్ పాయిజన్‌పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో ఇవాళ(బుధవారం) విచారణ జరిగింది.

ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు చనిపోతే కానీ స్పందించరా? అంటూ హైకోర్టు సీజే ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు సీజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకని సీజే ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? అంటూ ఆగ్రహించారు.

నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో అధికారులు హాజరవుతారని చురకలు అంటించారు. అధికారులకు కూడా పిల్లలు ఉన్నారు కదా అని ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం చెప్పింది. భోజన విరామం తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తామని హైకోర్టుకు ఏఏజీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తోందని హైకోర్టుకు చిక్కుడు ప్రభాకర్ తెలిపారు.

Exit mobile version