మల్లన్నా – కవిత, ఏమిటీ గొడవ
తెలంగాణ జాగృతి సంస్థకు చెందిన కార్యకర్తలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచరులు, ఆయన గన్ మెన్ సైతం విరుచు కుపడ్డారు. తుపాకీతో బెదిరించడమే కాకుండా.. భౌతికంగా కూడా వారిపై దాడి చేశారు. బీసీ రిజర్వేషన్ వి షయంపై బీఆర్ ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి చీఫ్.. కవిత ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిజర్వేషన్ వ్యవహారం.. కాంగ్రెస్-కవితల మధ్య మాటల తూటాలు పేలుస్తోంది.
అయితే.. ఈ వ్యవహారంలో కవితను ఎండగడుతూ.. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారి తీశాయి. మంచం-కంచం అంటూ.. ఆయన చేసిన విమర్శలపై జాగృతి కార్యకర్తలు.. ఆదివారం హైదరాబాద్ సమీపంలోని మేడిపల్లిలో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడికి యత్నించారు. లోపలికి చొచ్చుకుపోయి.. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఆఫీసు అద్దాలను పగులగొట్టే ప్రయత్నం కూడా చేశారు. దీంతో ఆఫీసు సిబ్బంది సహా మల్లన్న గన్ మెన్ రెచ్చిపోయారు.
తుపాకీతో జాగృతి కార్యకర్తలను బెదిరించడంతోపాటు.. వారిపై పిడిగుద్దులు గుద్దారు. ఈ క్రమంలో ఒకరిద్దరు జాగృతి కార్యకర్తలు.. తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఆఫీసు లోపల రక్తపు మడుగు కట్టడం.. రక్తం కారడం.. గచ్చంతా రక్తంతో తడిచి ఉన్న దృశ్యాలు.. వెలుగు చూశాయి. మొత్తంగా లోపల తీవ్రంగానే దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసినట్టు చెబుతు న్నారు. మరోవైపు.. కాంగ్రెస్ నుంచి దూరంగా ఉన్న తీన్మార్ మల్లన్నకు.. పార్టీ ఏమేరకు అండగా ఉంటుందో చూడాలి.