ఇందిరమ్మ ఇళ్ల మార్కవుట్ పనులు అక్టోబర్ 31లోగా పూర్తి చేయాలి
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాలు
ఫీల్డ్ విజిట్‌లతో పురోగతి సమీక్షించాలన్న సూచన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 23
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం తన ఛాంబర్‌లో పీడీ హౌసింగ్, మెప్మా, మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు, ఏఈలతో సమావేశం నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల మార్కవుట్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ నెల 31లోగా వందశాతం మార్కవుట్ పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి జీపీ, వార్డు వారీగా ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి సమావేశాలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. స్థల మార్కింగ్ పనులు తక్షణమే పూర్తి చేసి ప్రతి అర్హ కుటుంబం తమ గృహనిర్మాణాన్ని ప్రారంభించేందుకు అవసరమైన వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీవోలు, ఎంఈపీవోలు తమ మండలాల్లో పర్యవేక్షణ కొనసాగించి పురోగతి నివేదికలు సమర్పించాలని సూచించారు. అలాగే మార్కవుట్ పూర్తి చేసిన గ్రామాల వివరాలను ప్రతిరోజు అప్‌డేట్ చేయాలని, ప్రత్యేక మానిటరింగ్ బృందాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
లబ్ధిదారులు నిర్మాణానికి అవసరమైన నిధులను మహిళా సంఘాల ద్వారా లోన్ రూపంలో పొందేలా చర్యలు తీసుకోవాలని, ఇది గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. పేదలకు సొంత గృహం కల సాకారం అవ్వడం ఇందిరమ్మ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు.