వినాయక నవరాత్రి ఉత్సవాలపై మధిర పోలీసులు కఠిన సూచనలు

వినాయక నవరాత్రి ఉత్సవాలపై మధిర పోలీసులు కఠిన సూచనలు

ముందస్తుగా కమిటీ ఏర్పాటు తప్పనిసరి – సభ్యుల వివరాలు పోలీసులకు ఇవ్వాలి

పబ్లిక్ ప్రదేశాల్లో విగ్రహాలకు పంచాయతీ అనుమతి తప్పనిసరి

రాత్రి 10 గంటల తర్వాత కార్యక్రమాలకు నిషేధం – డీజేలకు అనుమతి లేదు

శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు – బలవంతపు చందా వసూళ్లపై కేసులు

నిమజ్జన ఊరేగింపుల వివరాలు ముందుగానే పోలీసులకు అందజేయాలి

మధిర, ఆగస్టు 22:

మధిర టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించదలచిన కమిటీలకు పోలీసులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఉత్సవాలను నిర్వహించబోయే ప్రాంతాల్లో ముందుగానే కమిటీ ఏర్పాటు చేసుకుని సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలని ఇన్స్పెక్టర్ డి. రమేష్ తెలిపారు.

పబ్లిక్ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకునే వారు సంబంధిత పంచాయతీ అనుమతి, సొంత స్థలాల్లో ఏర్పాటు చేసేవారు యజమాని అనుమతి తీసుకోవాలని సూచించారు. విగ్రహాల వల్ల ట్రాఫిక్‌ లేదా ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

మైక్‌లు, సౌండ్ బాక్స్‌లకు డీఎస్పీ అనుమతి తప్పనిసరి కాగా, డీజేలకు కఠిన నిషేధం విధించారు. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు జరపరాదని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు, కొజ్జా మేళాలు జరిగితే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

బలవంతపు చందా వసూళ్లకు కూడా కఠిన చర్యలు తప్పవని, మండపాల్లో విద్యుత్‌ కనెక్షన్లు అధికారుల అనుమతితోనే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిమజ్జన ఊరేగింపులో మద్యం సేవించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం నేరమని, వాహన డ్రైవర్ల రికార్డులు, ఆధార్ కాపీలు పోలీసులకు ముందుగానే సమర్పించాలని స్పష్టం చేశారు.

“శాంతి భద్రతలతో పాటు ప్రజలు భక్తి, భక్తి ఉత్సాహాలతో వినాయక నవరాత్రులు జరుపుకోవాలి” అని ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment