డీఎస్సీ-2008 అభ్యర్థులకు కొలువులు..

డీఎస్సీ-2008 అభ్యర్థులకు కొలువులు..!!

– అక్టోబర్‌ 4వరకు సర్టిఫికెట్ల పరిశీలన 

– మెరిట్‌ జాబితాలో పలువురి పేర్లు గల్లంతు 

– కలెక్టర్‌, డీఈవోలకు ఫిర్యాదు 

– ఆందోళనలో అభ్యర్థులు

IMG 20240928 WA0042

అధికారులు, ప్రజాప్రతినిధులు, కోర్టుల చుట్టూ తిరుగుతూ సుదీర్ఘ పోరాటం చేసిన డీఎస్సీ-2008 అభ్యర్థుల కల ఎట్టకేలకు సాకారం కానుంది.ఓవైపు న్యాయపోరాటం, మరోవైపు ప్రభుత్వా లను న్యాయం కోసం వేడుకుంటూ ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న వారి పోరాటానికి ప్రతిఫలం దక్కనుంది. దీనితో ఆనాడు నిర్వహించిన డీఎస్సీ-2008లో పరీక్షలు రాసి కామన్‌మెరిట్‌లో క్వాలిఫై అయి నష్టపోయిన 30శాతం బీఎడ్‌ అభ్యర్థులు సంతోషంలో మునిగితేలుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యమో… లేక తప్పిదమో కానీ దేవుడు వరమిచ్చినా..పూజారి కరుణించని మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించినా జిల్లా విద్యాశాఖ అధికారులు రూపొందించిన మెరిట్‌ జాబితాలో వారి పేర్లు కనిపించక పోవడంతో కొంత మంది అభ్యర్థులు ఉద్యోగం చేజారిపోతుందనే ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. 2008లో బీఎడ్‌ క్వాలిఫికేషన్‌తో డీఎస్సీ పరీక్షలు రాసి కామన్‌ మెరిట్‌లో సెలక్టు అయిన వారందరికీ అప్పుడే ఉద్యోగాలివ్వాల్సి ఉండగా తమకు ఉద్యోగాలివ్వకుండా అన్యాయం చేశారని, తమకు నష్టం జరిగిందంటూ అప్పటి నుంచే మెరిట్‌లో సెలక్టు అయిన అభ్యర్థులు పోరాటం ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బీఎడ్‌తో డీఎస్సీ రాసి ఉద్యోగాలు రానివారు 200లకు పైగా అభ్యర్థులుండగా, ఆ తర్వాత నిర్వహించిన డీఎస్సీలో కొందరు పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందారు. అయితే ఇప్పటికీ ఇంచుమించు 200 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదని నష్టపోయిన అభ్యర్థులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు విధానంలో వీరందరికీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెరిట్‌ జాబితాను ప్రకటించి, సర్టిఫికెట్ల పరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంతో పాటు వెబ్‌సైట్‌లో శుక్రవారం మెరిట్‌ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలోని అభ్యర్థులు అక్టోబర్‌ 4వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్లను పరిశీలన చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సీహెచ్‌వీఎస్‌ జనార్ధన్‌రావు సూచించారు. అయితే ఈ జాబితా పూర్తిగా తప్పుడు తడకలుగా ఉందని, ఉద్యోగాలు వచ్చిన వారి పేర్లను కూడా చేర్చారని, కామన్‌ మెరిట్‌ లిస్ట్‌లో ఎంపికైన వారి పేర్లను చేర్చలేదంటూ పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. తమలాగే దాదాపు 15 మంది అభ్యర్థుల పేర్లను మెరిట్‌ లిస్ట్‌లో చేర్చలేదని, దీనిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ నష్టపోయిన సెలెక్టెడ్‌ బీఎడ్‌ అభ్యర్థులు వై.వేణుగోపాల్‌, ఎస్‌.రాజిరెడ్డి జిల్లా కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. దాదాపు 15ఏళ్లుగా చేస్తున్న పోరాటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలివ్వాలని ఆదేశిస్తే తమకు అధికారులు నష్టం చేసే విధంగా మెరిట్‌ జాబితాను తప్పుల తడకగా తయారు చేశారని, ఉద్యోగం వస్తుందనే తమ ఆశలను అడియాశలు కాకుండా కాపాడాలని అధికారులను కోరుతున్నారు.

Join WhatsApp

Join Now