మెదక్/రామాయంపేట, డిసెంబరు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.200 కోట్లను కేటాయించానని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని తాను చేసిన సవాల్‌కు సమాధానమేదని బీజేపీ మెదక్ అసెంబ్లీ ఇంచార్జ్, నిజాంపేట్ మాజీ జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్ ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించిన నిధులను చూపిస్తే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని, లేని పక్షంలో అధికార పార్టీ నాయకులు ప్రజలకు బహింరంగంగా క్షమాపణలు చెప్పాలని మీడియా ముఖంగా సవాల్ చేసిన విషయం ప్రజలకు విధితమే. సోమవారం రామాయంపేట పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం చేకూర్చని చర్చికి రూ. 29.18కోట్లు కేటాయించామని చెబుతున్న ఎమ్మెల్యే, ప్రభుత్వానికి ఆదాయం అందించే ఏడుపాయలను ఎందుకు విస్మరించారని ఆయన నిలదీశారు. కోట్ల నిధులు కేటాయించిన చర్చి నుంచి ప్రభుత్వానికి ఏ రూపంగా ఆదాయ వనరులు చేకూరుతున్నాయో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందన్నారు. చర్చి నిర్మాణ సమయంలో అప్పటి ప్రభుత్వం 200 ఎకరాలను లీజుకు ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తుకు చేస్తు, ప్రస్తుత ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే గడువు పూర్తయిన భూములను స్వాధీనం చేసుకోని, పట్టణాభివృద్ధికి తోడ్పాడాలని డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలో ప్రమాదాలను నివారించడం కోసం తూతూ మంత్రంగా ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశామంటున్న ఎమ్మెల్యే, దాని ద్వారా ఏ రకంగా ప్రమాదాలను నివారిస్తారో తెలియజేయాలని అన్నారు. అంతే కాకుండా గత మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలు మెదక్ పట్టణానికి రింగ్ రోడ్డు తీసుకోస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏడుపాయలపై అంత నిర్లక్షం ఎందుకు..? ప్రతి సంవత్సరం కోన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఆదాయ రూపకంగా అందిస్తున్న ఏడుపాయలపై అంత నిర్లక్ష్యం ఎందుకని పంజా విజయ్ కుమార్ ప్రశ్నించారు. ఏడుపాయల వన దుర్గ భవానీ దేవస్థానం అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నారు. చర్చికి కోట్ల రూపాయలను కేటాయించి, ఏడుపాయలను విస్మరించడం వల్ల ఎంతో మంది హిందువుల మనోభావాలను పరోక్షంగా దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏడుపాయల అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించాలని పంజా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రామాయంపేట పట్టణ ఇంచార్జ్ వెల్ముల సిద్దిరాములు, మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, సీనియర్ నాయకులు జె.శంకర్ గౌడ్, పట్టణ యువ మూర్చ నాయకులు కన్నయ, నాయకులు నాగరాజుగౌడ్ భరత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలి: మెదక్ బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్, విజయ్ కుమార్
Updated On: December 16, 2024 6:25 pm