భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
ప్రశ్న ఆయుధం నవంబర్ 29: కుత్బుల్లాపూర్ ప్రతినిధి
సమైక్య ప్రభుత్వాల పాలనలో అడుగడుగునా వివక్షతకు గురైన ప్రాంతం తెలంగాణ. స్వరాష్ట్ర సాధనతోనే తెలంగాణ దశ, దిశను మార్చేందుకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించిన రోజు నవంబర్ 29, 2009 ను స్మరించుకుంటూ నిర్వహించే కార్యక్రమం దీక్షా దివాస్. దీక్షా దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ఎమెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమానికి దీక్షా దివాస్ కార్యక్రమ ఇంచార్జ్, ముఖ్యఅతిథిగా శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తో పాటుగా బిఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంటు ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి , జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కెపి.వివేకానంద్ , మల్లారెడ్డి , మాధవరం కృష్ణారావు , మర్రి రాజశేఖర్ రెడ్డి , ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దీక్షా దివాస్ ప్రారంభ సూచికగా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అమరవీరుల స్తూపానికి పూలను వేస్తూ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర జాతిపిత అయిన కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా _ముఖ్యఅతిథిగా హాజరైన స్వామి గౌడ్_ మాట్లాడుతూ 60 ఏళ్ల కాలంలో అన్ని రంగాలలో వివక్షతకు గురైన తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్ర సాధన తోనే అభివృద్ధి చెందుతుందని భావించిన తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు “తెలంగాణ వచ్చుడో… కెసిఆర్ సచ్చుడో” అనే నినాదంతో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించిన రోజే ఈ దీక్షా దివాస్ అని అన్నారు. గత 60 ఏళ్ల కాలంలో అన్ని రంగాలలో వివక్షకు గురై ధ్వంసమైన తెలంగాణ ప్రాంతాన్ని కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించడమే కాక, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల కాలంలోనే దేశ తలసరి ఆదాయాన్ని మించిన ఆదాయంతో అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్ ది అన్నారు. కెసిఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు భయపడిన నాటి యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని తెలియజేస్తూ అప్పటి హోం శాఖ మంత్రి చిదంబరం ద్వారా అర్ధరాత్రి ప్రకటన చేయించారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు.
కానీ నేటి కాంగ్రెస్ పాలకులు మాత్రం తెలంగాణ చరిత్రలో కెసిఆర్ ని తెలంగాణ ప్రజలు మర్చిపోయే విధంగా అభివృద్ధి చేస్తామంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కెసిఆర్ ఒక వ్యక్తి కాదు ఒక చరిత్ర తమ పాలనతో వ్యక్తిని మరిపించవచ్చు కానీ, చరిత్రను మర్చిపోయాలా చేస్తాం అనడం మూర్ఖత్వమే అవుతుంది.
అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ సమైక్య పాలకుల చేతిలో అడుగున వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్ర సాధన తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి కేంద్రంతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు, తెలంగాణ దార్శనికుడు కెసిఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధి ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే అభివృద్ధి మంత్రంగా రాష్ట్రాన్ని దేశ తలసరి ఆదాయంతో సమానంగా అభివృద్ధి చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మా వాళ్లేనంటూ సంక్షేమం, అభివృద్ధిలో కుల, మత, ప్రాంతాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాలలో జలసిరులు నింపి సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
అభివృద్ధిలో దేశంలోనే అగ్రపదాన నిలిచిన హైదరాబాద్ నగరాన్ని అండర్ పాసులు, ఫ్లై ఓవర్ లు, మెట్రో విస్తరణతో మరింత అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్ మార్గదర్శకత్వం లోని టిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 11 నెలలలో వారు చేసిన అభివృద్ధి శూన్యమని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చిన పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఎన్నికలు ఎప్పుడైనా బిఆర్ఎస్ పార్టీకే ప్రజలు తమ మద్దతును తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంతో కొట్లాడి ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాలనీలలో ప్రజా సమస్యలను ప్రజా ప్రతినిధుల వద్దకు తీసుకువచ్చి ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. కాబట్టి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించి రానున్న జిహెచ్ఎంసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా మరో మారు రెపరెపలాడే విధంగా పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల సభ్యులు, మహిళా నాయకురాలు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.