*జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా వైద్యాధికారుల ఘన సంబరాలు**
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 1
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా. సి. ఉమా గౌరి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా డా. ఉమా గౌరి మాట్లాడుతూ, “ప్రతి ప్రాణం వెనుక వైద్యుని సేవ ఉంటుంది. వైద్యుల నిస్వార్థ సేవలకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. మేడ్చల్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యుల పాత్ర ఎంతో కీలకం” అని పేర్కొన్నారు.కోవిడ్ మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి చేసిన సేవలను ఆమె గుర్తు చేస్తూ, “ఆ సమయంలో వారి త్యాగం దేశానికే ఆదర్శం. డా. బీసీ రాయ్ చూపిన సేవామార్గం ప్రతి వైద్యుడికీ దిక్సూచి. అలాంటి ఆదర్శ వైద్యుల వారసులుగా సేవలందించడంలో మన వైద్యులు గర్వపడతారు” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కీసర మరియు మల్కాజ్‌గిరి ఉప జిల్లా వైద్యాధికారులు డా. శోభా రాణి, డా. సత్యవతి, జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డా. శ్రీదేవి, డా. మల్లేశ్వరి, డా. గీతా, డా. చంద్రకళా, డా. కౌశిక్, డా. వినోద్‌తో పాటు డీఏంహెచ్‌వో కార్యాలయ సిబ్బంది, ఇతర ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.వైద్యుల సేవను గౌరవించుకోవాల్సిన రోజు అయిన ఈ దినోత్సవాన్ని, ఆరోగ్యశాఖ ఘనంగా నిర్వహించి ప్రేరణాత్మకంగా తీర్చిదిద్దినట్లు వ్యాఖ్యానించారు.