రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ సమీక్ష

*రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ సమీక్ష*

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 6

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చూడాలని సూచించారు. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు, పరిశీలించిన వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న దరఖాస్తులను వెంటనే బ్యాంకర్స్ లాగిన్‌కు పంపాలని, అవసరమైన ధ్రువపత్రాల కోసం దరఖాస్తుదారులకు ఫోన్ చేసి తెప్పించుకోవాలని సూచించారు. పూర్తిగా అర్హత లేని దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచాలని, తిరస్కరించవద్దని స్పష్టం చేశారు.

బ్యాంకర్లు సిబిల్ స్కోర్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే, మొదటి రెండు కేటగిరీలకు సిబిల్ స్కోర్ అవసరం లేదని, మూడవ మరియు నాల్గవ కేటగిరీ దరఖాస్తులకు మాత్రం తప్పనిసరిగా చూడాలన్నారు. ఒక మున్సిపాలిటీ దరఖాస్తు మరొక మున్సిపాలిటీకి లేదా ఒక వర్గం దరఖాస్తు మరొక వర్గానికి వస్తే, వాటిని వెంటనే ఆన్‌లైన్‌లో సంబంధిత విభాగానికి పంపాలని సూచించారు. ఎంపికైన దరఖాస్తుల జాబితాను ఎప్పటికప్పుడు పంపాలని అధికారులకు తెలిపారు.

అంతకుముందు, కలెక్టర్ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మండలాల వారీగా పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. దరఖాస్తుల పరిశీలనలో జాగ్రత్తగా ఉండాలని, ఎంపిక ప్రక్రియలో పూర్తి బాధ్యత అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు.

అనంతరం, కలెక్టర్ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం దరఖాస్తులను పరిశీలించి, లబ్ధిదారుల ఎంపికపై సమీక్షించారు. ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. పూర్తయిన లబ్ధిదారుల జాబితాను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తనకు పంపాలని సూచించారు.

ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ కాంతమ్మ, డీఆర్‌డీఓ సాంబశివరావు, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖాధికారి విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోసిస్, ఎల్డీఎం, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి, హౌజింగ్ ఈడీ రమణ మూర్తి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now