సీఎం రేవంత్‌తో మీనాక్షి నటరాజన్, మహేష్‌గౌడ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో టీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ(బుధవారం జులై 30) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై మాట్లాడారు. దాదాపు గంటన్నరపాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల(జులై) 31వ తేదీ నుంచి వచ్చే నెల (ఆగస్టు) 4వ తేదీ వరకు యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర చేపట్టనుంది.
ఆగస్టు 5,6,7 మూడురోజుల పాటు 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికై ఢిల్లీలో కార్యాచరణ రూపొందించారు. ఆగస్టు 5వ తేదీన పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల వాయిదా తీర్మానం, చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకత్వం, బీసీ సంఘాల నాయకులు పాల్గొననున్నారు. ఆగస్టు 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక రైలులో ప్రతీ నియోజకవర్గం నుంచి 50 మంది కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. ఢిల్లీ పర్యటన అనంతరం తెలంగాణలో యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగనుంది..