ఖానాపూర్ -జనహిత పాదయాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావు
పది సంవత్సరాల తర్వాత సోనియా గాంధీ- రాహుల్ గాంధీపై నమ్మకంతో తెలంగాణ ప్రజలు
కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 75 వేల కోట్లు ఉంటే .. కెసీఆర్ పదేండ్ల పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేశారని, గతంలో ఏడాదికి రూ. 6500 కోట్ల వడ్డీ మాత్రమే చెల్లిస్తే, ఇప్పుడు నెలకు రూ. 6500 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ . 120 లక్షలకు పైగా అప్పు తీర్చామని చెప్పారు. ఇన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్న ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు.
బనకచర్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు మన నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు దోచిపెట్టారని మండిపడ్డారు.
బీజేపీ నాయకులు చిలక పలుకులు పలుకుతున్నారని, గతంలో మూడు రాష్ట్రాలను ఇచ్చి , తెలంగాణ కు మొండి చేయి చూపారని ఆరోపించారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీ, బీఆర్ఎస్ లకు లేదని అన్నారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటామని హామీనిచ్చారు.