తప్పు చేసిన ఏ ఒక్కరినీ ప్రభుత్వం విడిచిపెట్టదు: మంత్రి లోకేశ్
అమరావతి: తెదేపా కార్యకర్తల ధైర్యాన్ని, వైకాపా నేతల పిరికితనాన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి నారాలోకేశ్ అన్నారు. గత ఐదేళ్లులో అక్రమ కేసులతో ఎంత వేధించినా తెదేపా శ్రేణులు ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు..
సోషల్‌మీడియాలో అసభ్య పోస్టులపై పోలీసులు ఇచ్చిన నోటీసులకే వైకాపా నేతలు రాజకీయ సన్యాసం అంటున్నారని ఎద్దేవాచేశారు. నాడు తెదేపా కార్యకర్తలు తప్పు చేయలేదు కాబట్టే అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారని వెల్లడించారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ ప్రభుత్వం విడిచిపెట్టదని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో (AP Assembly Sessions 2024) మీడియాతో మంత్రి లోకేష్ (Nara Lokesh) చిట్‌చాట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని పేర్కొన్నారు. వైకాపా అధినేత జగన్, ఆయన పార్టీ నాయకులు కమిటీల ఓటింగ్‌కు వస్తున్నారా? అని ఎమ్మెల్యేలను ఆరాతీశారు. బలం లేనప్పుడు పోటీ ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు.
అనంతరం పలువరు ఎమ్మెల్యేలతో మంత్రి లోకేశ్ చర్చించారు. జాగ్రత్తగా పని చేయమని బాధ్యతలను ఇస్తూ ఎక్కువ ఓట్లతో ప్రజలు మనల్ని గెలిపించారన్నారు. ఎమ్మెల్యేల వినతులపై లోకేశ్ స్వయంగా స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే తనకు ఇచ్చిన ప్రతీ వినతిపత్రంలో ఎన్ని పరిష్కారమయ్యాయి? కాకపోతే అందుకు గల కారణాలు వివరిస్తూ స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. కేంద్ర మంత్రులకు వినతిపత్రం ఇస్తే వారు సమాధానం ఇస్తున్న విధానాన్ని ఇక్కడా అమలు చేస్తున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మరింత పటిష్ఠం చేస్తామన్నారు. పాఠశాలల సమయం (AP School Timings) పెంపుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తెచ్చారు. పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే ప్రస్తుతం దీన్ని అమలు చేస్తున్నామని, వస్తున్న ఫీడ్ బ్యాక్‌కు తగ్గట్లు నిర్ణయాలను మార్చుకుంటామని తెలిపారు. విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం పెంచేలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెంచుతామని మంత్రి లోకేశ్ తెలిపారు..