Site icon PRASHNA AYUDHAM

దళారుల జోక్యం లేకుండా నేరుగా ప్రజలకు సాండ్ బజార్ నుండి ఇసుకను సరఫరా: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

IMG 20250826 123342

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో సంగుపేట – జోగిపేట చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజలకు నాణ్యమైన ఇసుకను సరసమైన ధరలో అందించడం ప్రభుత్వ ప్రాధాన్య కర్తవ్యం అని, దళారుల బెడద లేకుండా, పారదర్శక పద్ధతిలో, నేరుగా ప్రజలకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం సాండ్ బజార్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇసుక తరలింపు వాహనాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి 20 కిలోమీటర్ల పరిధిలో సాండ్ బజార్లు, అందోల్ నియోజకవర్గం సహా జిల్లాలో ప్రతి 20 కిలో మీటర్ల పరిధిలో ఒక సాండ్ బజార్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, దీని వలన ప్రజలు తక్కువ దూరంలోనే అవసరమైన ఇసుకను సులభంగా పొందగలరని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో సహజసిద్ధమైన ఇసుక రీచ్‌లు లేవని, ఈ కారణంగా ఇక్కడి ప్రజలు ఇప్పటి వరకు అధిక ధరలకు, మధ్యవర్తుల ద్వారా ఇసుక కొనుగోలు చేయవలసి వచ్చేదని, ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) ఆధ్వర్యంలో సాండ్ బజార్లను ఏర్పాటు చేసిందని తెలిపారు.ఇకపై లబ్ధిదారులు, గృహ నిర్మాణదారులు తక్కువ ధరలో, నాణ్యమైన ఇసుకను ఈ బజార్ల ద్వారా పొందవచ్చని మంత్రి తెలిపారు. ఇసుక కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అయిందన్నారు. సాండ్ దళారుల బెడదను పూర్తిగా అరికట్టాలని మంత్రి స్పష్టం చేశారు. ఇసుక సరఫరా ప్రక్రియలో ఎవరైనా దళారుల మాదిరిగా వ్యవహరించినా, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనింగ్ కార్పొరేషన్, రెవెన్యూ, హౌసింగ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఇసుక సరఫరాను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం తరపున మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఇసుక కొరత సమస్య రాకూడదని, లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, వారికి కావలసినంత ఇసుక సాండ్ బజార్లలో నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సాండ్ బజార్ల ఏర్పాటు వలన స్థానిక కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, చిన్న కాంట్రాక్టర్లు, మేస్త్రీలు కూడా నాణ్యమైన ఇసుకను సులభంగా పొందగలరని అధికారులు తెలిపారు. ఇసుక సరఫరా ఆన్‌లైన్‌లోనూ పర్యవేక్షణ జరుగుతుందని, ఎవరైనా అక్రమ రవాణా చేస్తే వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజీఎండిసి ఎండీ భవేష్ మిశ్రా, జిల్లా అదనపు (స్థానిక సంస్థలు) కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రఘుబాబు, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మార్కెఫెడ్ డైరెక్టర్ శేరి జగన్ మోహన్ రెడ్డి , పిఎసిఎస్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, హౌసింగ్, రెవిన్యూ, పోలీస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version